గుజరాత్‌లో అమానుషం.. ప్రియుడితో పారిపోయిందని వివాహితను నగ్నంగా ఊరేగించిన కుటుంబ సభ్యులు

16-07-2021 Fri 09:02
  • వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి
  • పారిపోయిన భార్యను తీసుకొచ్చి పంచాయితీ
  • దాడిచేసి, ఆపై గ్రామంలో ఊరేగింపు
  • భర్త సహా 18 మంది అరెస్ట్
Man parades wife naked over alleged extra marital affair

గుజరాత్‌లోని దహోడ్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను పట్టుకున్న భర్త.. కుటుంబ సభ్యులతో కలిసి నగ్నంగా ఊరేగించాడు. గత నెలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వారి కథనం ప్రకారం.. జిల్లాలోని ఓ గిరిజన ప్రాంతానికి చెందిన వివాహిత (23) గత నెలలో మరో వ్యక్తితో కలిసి వెళ్లిపోయింది. భర్త, కుటుంబ సభ్యులు గాలించి మొత్తానికి ఆమె ఆచూకీ తెలుసుకున్నారు. అనంతరం గ్రామానికి తీసుకొచ్చారు. ఈ నెల పెద్దల సమక్షంలో 6న పంచాయితీ పెట్టారు. పారిపోయినందుకు శిక్షగా భర్త, అతడి కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా కొట్టడంతోపాటు నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి భర్తతోపాటు 18 మందిని అరెస్ట్ చేశారు.