తెలుగు అకాడెమీ పేరు మార్పును వాళ్లు తప్ప సమర్థించే వారు ఎవరూ లేరు: మండలి బుద్ధ ప్రసాద్

15-07-2021 Thu 19:49
  • తెలుగు అకాడెమీ పేరు మార్పు
  • ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత
  • విమర్శలు చేసిన మండలి బుద్ధప్రసాద్
  • తాజాగా సీఎం జగన్ కు లేఖ
Mandali Buddha Prasad wrote CM Jagan on Telugu Academy name change

తెలుగు అకాడెమీ పేరును తెలుగు-సంస్కృత అకాడెమీగా మార్చుతున్నట్టు ఏపీ సర్కారు వెల్లడించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వంపై తన విమర్శల పర్వాన్ని నేడు కూడా కొనసాగించారు. అకాడెమీ పేరు మార్చడంపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు. రాజకీయ పార్టీలు నిరసనలు తెలిపాయని, సోషల్ మీడియాలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వివరించారు. పత్రికలు, మీడియా చానళ్లలోనూ నిరసనలు వచ్చాయని తెలిపారు.

సంస్కృత భాషాభివృద్ధికి ఎవరూ వ్యతిరేకం కాదని, అందుకోసం ప్రత్యేక అకాడెమీ ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తమ మాటలు ఇతరులు వినాలని కోరుకునేవారు, ఇతరుల మాటలను కూడా వినాలని... ఇది ప్రజాస్వామ్య మూలసూత్రం అని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుందే తప్ప, నష్టమేమీ ఉండదని మండలి బుద్ధప్రసాద్ తెలిపారు.

అయినా, తెలుగు అకాడెమీ పేరు మార్పును తెలుగు-సంస్కృత అకాడెమీ అధ్యక్షులు, అధికార భాషా సంఘం అధ్యక్షులు మినహా మరెవ్వరూ సమర్థించేవారు లేరని స్పష్టం చేశారు. ఈ మేరకు మండలి బుద్ధ ప్రసాద్ సీఎం జగన్ కు లేఖ రాశారు.