'పుష్ప' కోసం ఉత్కంఠతో ఉన్నాను: ఫాహద్ ఫాజిల్

15-07-2021 Thu 19:19
  • సుకుమార్ సినిమాలు చూశాను
  • బన్నీ స్టైల్ చాలా బాగుంటుంది
  • ఇద్దరితో చేయడం లక్కీ
  • త్వరలో షూటింగులో జాయిన్ అవుతాను
Fahadh Fassil said about Allu AArjun and Sukumar

మలయాళంలో ఫాహద్ ఫాజిల్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యలో ఆయన విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. అంతేకాదు, పరభాషా చిత్రాలలో నటించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. 'పుష్ప' సినిమాతో ఆయన తెలుగు తెరకి పరిచయం కానున్నాడు. ఈ పాటికే ఆయన 'పుష్ప' సినిమా షూటింగులో పాల్గొనవలసింది. కానీ కరోనా కారణంగా షూటింగు ఆగిపోవడం వలన ఆలస్యమైంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన 'పుష్ప' సినిమాను గురించి ప్రస్తావించాడు.

" నన్ను 'పుష్ప' సినిమా కోసం అడగడానికి ముందే నేను సుకుమార్ గారి సినిమాలు చూశాను. ఆయన ట్రీట్మెంట్ నాకు బాగా నచ్చుతుంది. ఆయన క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందువలన ఆయన సినిమాలో చేసే అవకాశం వస్తే బాగుండేదని నేను అనుకునేవాడిని. అలాగే బన్నీ మూవీస్ కూడా చూశాను. ఆయన ఎంచుకునే కథలు .. పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా ఆయన డాన్స్ చాలా బాగా చేస్తారు. ఆయనతో కలిసి ఒక సినిమా అయినా చేయాలనుకున్నాను. లక్కీగా ఇద్దరితో కలిసి చేసే అవకాశం వచ్చింది .. అందుకు చాలా హ్యాపీగా ఉంది. త్వరలోనే షూటింగులో జాయిన్ కానున్నాను" అని చెప్పుకొచ్చారు.