కోకాపేటలో కోట్లు పలికిన భూములు... వేలానికి అదిరిపోయే స్పందన

15-07-2021 Thu 19:14
  • వేలానికి 49.92 ఎకరాల ప్రభుత్వ భూమి
  • వేలం వేసిన హెచ్ఎండీఏ
  • ఎకరం కనీస ధర రూ.25 కోట్లు
  • వేలంలో రూ.45 కోట్లు పలికిన వైనం
Huge response to Kokapet lands auction

హైదరాబాదు శివారు ప్రాంతం కోకాపేటలోని ప్రభుత్వ భూములను ఇవాళ వేలం వేయగా, భారీ స్పందన వచ్చింది. భూములకు అత్యధిక ధరలు లభించాయి. ఈ భూముల వేలానికి గత సంవత్సరం నుంచి హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సన్నాహాలు చేస్తోంది. నియో పోలిస్ వెంచర్ లోని 49.92 ఎకరాలను ఇవాళ ఎమ్మెస్టీసీ వెబ్ సైట్ ద్వారా వేలం వేసింది. ఒక్కో ఎకరం రూ.45 కోట్లకు పైగా ధర పలకడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి.

ఎకరం కనీస ధరను ప్రభుత్వం రూ.25 కోట్లుగా ప్రకటించగా, దాదాపు అంతకు రెట్టింపు ధర లభించడం విశేషం. కోకాపేటలో నేడు వేలం వేసిన భూములు అవుటర్ రింగురోడ్డు పక్కనే ఉండడమే అందుకు కారణం. కాగా, ఈ వెంచర్ కు చేరుకునేందుకు ట్రాఫిక్ సమస్యలు ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేకంగా రహదారులు నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో, రియల్ వ్యాపారులు భారీగా వేలం పాటలో పాల్గొన్నట్టు తెలుస్తోంది.

గతంలో ఇక్కడ కొన్ని భూములను వేలంగా వేయగా గరిష్ఠంగా రూ.40 కోట్ల వరకు ధర పలకగా, ఈసారి అంతకు మించిన ధర పలికింది. మిగిలిన భూములకు రూ.50 కోట్ల వరకు ధర వెళుతుందని భావిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా వేలంలో పాల్గొంటున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.