రొమాంటిక్ హీరోగా కార్తికేయ కొత్త ప్రాజెక్ట్!

15-07-2021 Thu 18:33
  • కార్తికేయ తాజా చిత్రంగా 'రాజా విక్రమార్క'
  • కథానాయికగా తాన్య రవిచంద్రన్
  • కొత్త దర్శకుడితో మరో సినిమా
  • రుహాని శర్మకు ఛాన్స్    
Karthikeya new movie is coming soon

కార్తికేయ హీరోగా 'రాజా విక్రమార్క' నిర్మితమవుతోంది. ఈ సినిమాలో ఆయన విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఆయన పాత్ర స్వరూప స్వభావాలు కొత్తగా ఉంటాయి. అందువలన ఈ సినిమాపై ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఆయన సరసన నాయికగా తాన్య రవిచంద్రన్ అలరించనుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కార్తికేయ మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ కథలో ఆయన రొమాంటిక్ హీరోగా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు.

యూవీ క్రియేషన్స్ వారు భారీ సినిమాలు తీస్తూ వస్తున్నారు. దానికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ ను ఏర్పాటు చేసుకుని ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. అలా ఇటీవల వచ్చిన 'ఏక్ మినీ కథ' సక్సెస్ అయింది. దాంతో వాళ్లు మరో ప్రాజెక్టును సెట్ చేస్తున్నారు. కార్తికేయ హీరోగా ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ పరిచయం కానున్నాడు. కార్తికేయ జోడీగా 'రుహాని శర్మ'ను తీసుకున్నారట. 'డర్టీ హరి'తో యూత్ ను ఆకట్టుకున్న ఈ అమ్మాయి, అవసరాల సరసన కూడా '101 జిల్లాల అందగాడు' చేస్తోంది. కార్తికేయ కొత్త ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.