రాజస్థాన్ రైతు ఇంట ఉద్యోగాల పంట.. ఐదుగురు కుమార్తెలకూ ప్రభుత్వ ఉద్యోగాలు

15-07-2021 Thu 18:09
  • హనుమాన్ గఢ్ వాసి సహదేవ్ ఓ రైతు
  • ఆయనకు ఐదుగురు కుమార్తెలు
  • గతంలో రోమా, మంజుకు ప్రభుత్వ ఉద్యోగాలు
  • తాజాగా అన్షు, సుమన్, రీతూలకు ఉద్యోగాలు
All five daughters of Rajasthan farmer gets govt jobs

రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ కు చెందిన సహదేవ్ సహరన్ ఓ రైతు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు. వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కుమార్తెలందరినీ చదివించాడు. ఇప్పుడా ఐదుగురు కుమార్తెలు రాజస్థాన్ ప్రభుత్వంలో ఉన్నతోద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకుంటున్నారు.

కొన్నిరోజుల కిందటే ఆర్ఏఎస్ (రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో సహదేవ్ కుమార్తెలు రీతు, సుమన్, అన్షు కూడా ఉన్నారు. ఆ రైతు మరో ఇద్దరు కుమార్తెలు రోమా, మంజు గతంలోనే ఆర్ఏఎస్ కొలువులు సాధించి జీవితంలో స్థిరపడ్డారు. ఒకే ఇంట్లో ఐదుగురు అమ్మాయిలు ఆర్ఏఎస్ సాధించడం మీడియాలో ప్రముఖంగా దర్శనమిస్తోంది. ఈ అంశాన్ని ఓ అటవీశాఖ ఉన్నతాధికారి ట్విట్టర్ లో పంచుకున్నారు.

సరైన విధంగా ప్రోత్సహిస్తే అమ్మాయిలు కూడా ఉన్నతస్థాయికి ఎదగగలరని ఈ రాజస్థాన్ అక్కాచెల్లెళ్లు నిరూపించారు. తాజాగా, ఆ రైతు కుటుంబంలో ముగ్గురమ్మాయిలు కూడా ఉద్యోగాలు సాధించడంతో హనుమాన్ గఢ్ వాసుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.