CM KCR: యువతను ప్రోత్సహించేలా ఐటీ పాలసీని రూపొందించాం: సీఎం కేసీఆర్

  • పరిస్థితులు మారాయన్న సీఎం కేసీఆర్
  • యువత నైపుణ్యాలు పెంచుకోవాలని సూచన
  • ప్రభుత్వం అందుకు తోడ్పాటు అందిస్తుందని వెల్లడి
  • తెలంగాణ యువత సమర్థవంతమైనదని కితాబు
CM KCR talks about Telangana youth skill and knowledge

ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర యువతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారిన పరిస్థితుల్లో యువత తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ యువత ఎంతో సమర్థవంతమైనదని, సమర్థతకు నైపుణ్యం కూడా తోడైతే తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని పేర్కొన్నారు.

ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలు లభించేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. తద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువతీ యువకులకు సాంకేతిక, సాంకేతికేతర పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా నైపుణ్య శిక్షణ అందిస్తామని సీఎం కేసీఆర్ వివరించారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్ యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గత ఏడేళ్లుగా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యాచరణ ఓ కొలిక్కి వచ్చిందని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా తాము అమలు చేస్తున్న సమీకృత అభివృద్ధి కార్యాచరణ మెరుగైన ఫలితాలను ఇస్తోందని సీఎం కేసీఆర్ వివరించారు.

పలు పథకాల అమలుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అయ్యాయని, తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి పెరుగుతోందని అన్నారు. పట్టణాల్లోనూ ఉపాధి రంగాలను మెరుగుపరిచే కార్యక్రమాలు అమలు చేస్తూ వాటి ఫలాలను యువతకు అందించే స్థాయికి చేరుకున్నామని వెల్లడించారు.

More Telugu News