చరిత్రలో ఒకేసారి 1.30 లక్షల మందికి రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వం ఒక్కటే: సజ్జల

15-07-2021 Thu 16:58
  • ఏపీఎన్జీవో మాజీ చీఫ్ చంద్రశేఖర్ రెడ్డికి సన్మానం
  • ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలా ఆయనని నియమిస్తామన్న సజ్జల  
  • వైఎస్సార్ లో ఉన్న విజన్ జగన్ లోనూ ఉందని కితాబు
Sajjala lauds CM Jagan on employment

ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన చంద్రశేఖర్ రెడ్డికి ఇవాళ సన్మాన సభ ఏర్పాటు చేశారు. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రశేఖర్ రెడ్డి సేవలను వినియోగించుకుంటామని, త్వరలోనే ఆయనను ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలా నియమిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన జీవో త్వరలోనే వస్తుందని పేర్కొన్నారు.

ఇక, సజ్జల ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఒకేసారి 1.30 లక్షల రెగ్యులర్ ఉద్యోగాలు కల్పించింది జగన్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం జగన్ కు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. సీపీఎస్ అమలు అంశం కాస్త జటిలమైనది కావడంతో ఆలస్యమైందని, త్వరలోనే ఆ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కసరత్తులు చేస్తున్నారని సజ్జల వెల్లడించారు. ఉద్యోగుల సర్వీసుకు సంబంధించిన అంశాలు, ఆర్థికపరమైన విషయాలన్నింటినీ పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

గతంలో ఉద్యోగుల అంశంలో వైఎస్సార్ ఎలాంటి దార్శనికత కలిగి ఉన్నారో, ఇప్పుడు సీఎం జగన్ లోనూ అదే దార్శనికత ఉందని సజ్జల కొనియాడారు.