నిర్మాతగా మారుతున్న ప్రముఖ హీరోయిన్!

15-07-2021 Thu 16:19
  • వ్యాపారాలపై దృష్టి పెడుతున్న కథానాయికలు
  • చిత్ర నిర్మాణంలోకి అడుగు పెడుతున్న తాప్సి
  • 'ఔట్ సైడర్ ఫిలిమ్స్' పేరిట ప్రొడక్షన్ హౌస్
Heroine Tapsee turns producer

ఈవేళ చాలామంది హీరోయిన్లు ఓపక్క సినిమాలలో నటిస్తూనే.. మరోపక్క ఇతర వ్యాపారాలపై కూడా దృష్టిపెడుతున్నారు. ఇక్కడ సంపాదించిన డబ్బును మరొక రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే, కథానాయికలు నిర్మాతలుగా మారి, సినిమా నిర్మాణంలోకి దిగడం తక్కువనే చెప్పాలి. చిత్ర నిర్మాణంలో రిస్క్ ఎక్కువని ఇందులోకి ఎక్కువగా రారు. అయితే, ఇటు దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ సినిమాలలో కూడా నటిస్తున్న సొట్టబుగ్గల కథానాయిక తాప్సి మాత్రం ఇప్పుడు చిత్ర నిర్మాణంలోకి అడుగు పెడుతోంది.

ఇందులో భాగంగా 'ఔట్ సైడర్ ఫిలిమ్స్' పేరిట తాజాగా ఓ ప్రొడక్షన్ హౌస్ ను నెలకొల్పింది. నిర్మాత, రచయిత ప్రంజల్ ఖండ్ దియాతో కలసి చిత్ర నిర్మాణాన్ని ఆమె చేబడుతోంది. దీని గురించి తాప్సి చెబుతూ, 'క్వాలిటీతో కూడిన అర్థవంతమైన, వినోదాత్మక చిత్రాలను మా బ్యానర్ పై నిర్మిస్తాం. నాలాగా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని టాలెంట్ వుండి, ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న యువకులకు మా సినిమాల ద్వారా అవకాశాలు కల్పిస్తాం' అని చెప్పింది. కాగా, ఈ బ్యానర్ పై తొలిచిత్రంగా ఓ థ్రిల్లర్ ను నిర్మించనున్నారు. ఇందులో తాప్సి ప్రధాన పాత్ర పోషిస్తుంది.