Balakrishna: 'మా' ఎన్నికలపై బాలకృష్ణ స్పందన

Balakrishna comments on MAA elections
  • లోకల్, నాన్ లోకల్ అనే విషయాలను పట్టించుకోను
  • గతంలో ఫండ్ రైజింగ్ వల్ల వచ్చిన డబ్బును ఏం చేశారు?
  • 'మా' భవనం కోసం టీఎస్ ప్రభుత్వం నుంచి ఒక్క ఎకరాని కూడా సంపాదించలేకపోయారా?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ వేడెక్కిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్న ప్రకాశ్ రాజ్ ని ఉద్దేశిస్తూ కొందరు నాన్ లోకల్ అనే ప్రస్తావనను కూడా తీసుకొచ్చారు. ఇది పెద్ద చర్చకే దారి తీసింది. మరోవైపు 'మా' ఎన్నికలపై బాలకృష్ణ స్పందించారు. లోకల్, నాన్ లోకల్ అనే విషయాలను తాను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు.

గతంలో 'మా' అసోసియేషన్ లో ఉన్నవాళ్లు ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ ఫస్ట్ క్లాస్ టికెట్లతో విమానాల్లో తిరిగారని... ఆ డబ్బులను ఏం చేశారని బాలయ్య ప్రశ్నించారు. 'మా' అసోసియేషన్ కు ఇంత వరకు శాశ్వత భవనాన్ని ఎందుకు నిర్మించలేకపోయారని అడిగారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా? అని ప్రశ్నించారు.
 
అయితే 'మా' శాశ్వత భవన నిర్మాణానికి మంచు విష్ణు ముందుకొచ్చారనే విషయాన్ని ప్రస్తావించగా... ఆ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని అవుతానని బాలయ్య చెప్పారు. పరిశ్రమలో అందరూ కలిస్తే అసోసియేషన్ కోసం మయసభలాంటి అద్భుతమైన భవనాన్ని కట్టుకోవచ్చని అన్నారు. సినీ పరిశ్రమ అనేది గ్లామర్ ఫీల్డ్ అని... ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను బహిరంగ వేదికలపై చర్చించకూడదని చెప్పారు.
Balakrishna
Tollywood
MAA

More Telugu News