Atchannaidu: సీజేఐ వ్యాఖ్యలతో ప్రజాస్వామ్యం బతికే ఉందని తేలింది: అచ్చెన్నాయుడు

  • దేశద్రోహం చట్టంపై సీజేఐ అసంతృప్తి
  • బ్రిటీష్ కాలం నాటి చట్టమని వ్యాఖ్యలు
  • స్పందించిన అచ్చెన్న
  • ఇప్పటికైనా ఏపీ సీఎం బుద్ధి తెచ్చుకోవాలని హితవు
Atchannaidu responds after CJI NV Ramana comments on sedition law

దేశద్రోహం సెక్షన్ 124 (ఏ)పై ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. బ్రిటీష్ కాలం నాటి చట్టాన్ని ఇప్పుడు కక్ష సాధింపులకు వాడుకుంటున్నారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. సీజేఐ వ్యాఖ్యలతో ప్రజాస్వామ్యం బతికే ఉందని తేలిందని పేర్కొన్నారు.

ఇప్పటికైనా ఏపీ సీఎం బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను జగన్ రెడ్డి ఇప్పుడు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. జగన్ వాక్ స్వాతంత్ర్యాన్ని కాలరాస్తున్నారని అన్నారు. ఈ సెక్షన్లు చెల్లవని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని, తమ వాదనలకు మద్దతుగా ఇవాళ సీజేఐ నుంచి కీలక వ్యాఖ్యలు వెలువడ్డాయని తెలిపారు. దీన్ని తాము స్వాగతిస్తున్నామని అచ్చెన్న తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన ఏపీ, తెలంగాణ జలవివాదాలపైనా స్పందించారు. నాడు కేసీఆర్ తో చేతులు కలిపినప్పుడు నీళ్ల సంగతి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. సీఎం అయిన వెంటనే హైదరాబాదులోని సచివాలయం, ఏపీ ఆస్తులను ఎలా ఇచ్చేశారని నిలదీశారు. నీళ్ల సంగతి తేల్చకుండా పుడింగిలా వెళ్లి ఆస్తులు ధారాదత్తం చేశారని అచ్చెన్న విమర్శించారు. ఇటీవలి పరిణామాలపై జగన్ ఏం చెబుతారని అన్నారు. ఇకనైనా నాటకాలు ఆపి జగన్ నీళ్ల అంశంపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News