అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నాననే వార్తలు బాధను కలిగిస్తున్నాయి: ఆర్. నారాయణమూర్తి

15-07-2021 Thu 15:22
  • నారాయణమూర్తి ఆర్థికంగా చితికిపోయారంటూ వార్తలు
  • ఆటోలకే రోజుకు రూ. వెయ్యి ఖర్చు చేస్తానన్న నారాయణమూర్తి
  • స్వేచ్ఛ కోసమే నగర శివార్లలో ఉంటున్నానని వ్యాఖ్య
I am financially in good position says R Narayana Murthy

పీపుల్ స్టార్ గా పేరుగాంచిన సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఆర్థికంగా చితికిపోయారంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఉండటానికి ఇల్లు కూడా లేక హైదరాబాద్ శివార్లలో అద్దె ఇంట్లో ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇటీవల జరిగిన 'రైతన్న' సినిమా ప్రివ్యూ సందర్భంగా గద్దర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి.

ఈ నేపథ్యంలో ఆర్.నారాయణమూర్తి స్పందిస్తూ... ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు. అద్దె కట్టలేక ఇబ్బంది పడుతున్నాననే వార్తలు అవాస్తవమని... స్వేచ్ఛగా ఉంటుందనే నగర శివార్లలో ఉంటున్నానని చెప్పారు. తనపై ప్రేమతో, అభిమానంతోనే గద్దర్ అలా చెప్పారని నారాయణమూర్తి అన్నారు.

సిటీలో ప్రయాణించడానికి తనకు ప్రతి రోజు వెయ్యి రూపాయలు ఖర్చవుతుందని... అంటే నెలకు రూ. 30 వేలు కేవలం ఆటోలకే ఖర్చు చేస్తున్నానని చెప్పారు. తనకు ఇల్లు ఇస్తానని గతంలో కొందరు అధికారులు చెప్పినా తాను తీసుకోలేదని అన్నారు. తనకు ఆర్థికంగా సాయం చేయగలిగే స్నేహితులు ఉన్నప్పటికీ వీరిని ఉపయోగించుకోవడం తనకు ఇష్టం ఉండదని చెప్పారు. ఇలాంటి అసత్య వార్తలు తన మనసుకు బాధను కలిగిస్తున్నాయని అన్నారు.