పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా సిద్దూ?

15-07-2021 Thu 14:43
  • వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు
  • అమరీందర్, సిద్దూ మధ్య ముదిరిన విభేదాలు
  • విభేదాలను చల్లార్చేందుకు హైకమాండ్ యత్నాలు
Navjot Singh Sidhu Likely To BePunjab Congress Chief

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ నియమితులయ్యే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు, సిద్దూకు మధ్య విభేదాలు రోజురోజుకు తీవ్ర తరమవుతున్నాయి. దీంతో, పార్టీలో అంతర్గత విభేదాలకు ముగింపు పలికేందుకు పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అమరీందర్ ను సీఎంగా కొనసాగిస్తూనే... సిద్దూకి పీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

ఇదే సమయంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇద్దరిని నియమించబోతున్నారు. వీరిలో ఒకరు దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, మరొకరు హిందువు అని తెలుస్తోంది. ఈ మార్పులతో పంజాబ్ కాంగ్రెస్ లో విభేదాలు సమసిపోతాయా? లేదా? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.