నిర్మాతగా కోడి రామకృష్ణ కూతురు .. హీరోగా కిరణ్ అబ్బవరం!

15-07-2021 Thu 12:47
  • కిరణ్ అబ్బవరం నుంచి కొత్త ప్రాజెక్టు
  • దర్శకుడిగా కార్తీక్ శంకర్ పరిచయం
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ
  • త్వరలో పూర్తి వివరాలు      
Kodi Ramakrishna elder daughter announces her new production

తెలుగు ప్రేక్షకులకు కుటుంబ నేపథ్యంలో సాగే ఎన్నో చిత్రాలను కోడి రామకృష్ణ అందించారు. తెలుగు కథకు గ్రాఫిక్స్ ను జోడించి ప్రయోగాలు చేసింది కూడా ఆయనే. ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి. అలాంటి ఆయన పెద్ద కూతురు దివ్య, సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని నిర్మాతగా రంగంలోకి దిగారు. కిరణ్ అబ్బవరం హీరోగా ఆమె ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కార్తీక్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మణిశర్మ సంగీతాన్ని అందించనున్నారు.ఈ రోజున కిరణ్ అబ్బవరం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తూ, ఈ విషయాన్ని ప్రకటించారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో తెలుగు తెరకి కిరణ్ అబ్బవరం పరిచయమయ్యాడు. ఆ తరువాత ఆయన చేసిన 'ఎస్ ఆర్ కల్యాణ మండపం' వచ్చేనెలలో విడుదల కానుంది. ఇక 'సెబాస్టియన్' .. 'సమ్మతమే' సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నాడన్న మాట. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.