అగ్రవర్ణ పేదలకు 'ఈడబ్ల్యూఎస్' రిజర్వేషన్ కోటా అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

15-07-2021 Thu 10:48
  • అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా
  • రూ. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు అర్హత
  • 2019లో ఈడబ్ల్యూఎస్ కోటాను సవరించిన కేంద్ర ప్రభుత్వం
AP govt to provide EWS quota for Upper caste poor

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ కోటాను కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం కోటా కల్పిస్తూ నిన్న అర్ధరాత్రి చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పేరిట జీవో జారీ అయింది. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో ఈ కోటా అమలవుతుంది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రూ. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉంటే అగ్రవర్ణ కుటుంబాలను ఆర్థికంగా వెనుకబడిన వారిగా గుర్తిస్తారు. ఈ కోటా కింద లబ్ధి పొందాలనుకునేవారు తహసీల్దార్ నుంచి ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందని ఇతర వర్గాల వారు ఈ కోటా కిందకు వస్తారు.

అగ్రవర్ణ పేదలకు కోటాను ప్రవేశ పెడుతూ 2019లో రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఈ కోటా కోసం పలు నిబంధనలను కూడా విధించింది. లబ్ధిదారులకు ఐదెకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండరాదు. నగరాల్లో అయితే వెయ్యి చదరపు అడుగులకు మించి ఫ్లాట్ ఉండరాదు. నగరాల్లో వంద గజాలు, గ్రామాల్లో రెండొందల గజాలకు మించి ఇంటి స్థలం ఉన్నవారు ఈ కోటా కిందకు రారని కేంద్రం తెలిపింది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ నిబంధనలను తీసేసి... వార్షికాదాయం రూ. 8 లక్షలకు మించరాదనే ప్రాతపదికను మాత్రమే తీసుకుంది.