వరకట్న వేధింపులకు నిరసనగా కేరళ గవర్నర్ నిరాహారదీక్ష

15-07-2021 Thu 09:28
  • రాష్ట్రంలో వరుస ఘటనలపై గవర్నర్ దిగ్భ్రాంతి
  • నిన్న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిరాహార దీక్ష
  • విద్యార్థులు ఎవరూ భవిష్యత్తులో కట్నం తీసుకోబోమని ప్రతిజ్ఞ చేయాలని సూచన
Kerala Governor fasts in protest against dowry atrocities against women

వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ నిన్న నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ఇటీవల వరకట్న వేధింపులు పెచ్చుమీరాయి. వరకట్న వేధింపులు తాళలేక ఇటీవల ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ దురాచారంపై ప్రజల్లో అవగాహన కల్పించి, దానిని అంతం చేయాలన్న సంకల్పంతో గవర్నర్ నిన్న తన అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌లో నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటలకు ఇది ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటలకు గాంధీభవన్‌లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి దీక్షను విరమించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో విద్యార్థులు తాము వరకట్నం తీసుకోబోమని, అలాగే ఇవ్వబోమని ప్రమాణం చేస్తూ కళాశాల నుంచి ధ్రువపత్రాలు తీసుకునే సమయంలో సంతకం చేయాలని సూచించారు. ఈ విషయమై రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లకు లేఖలు రాయనున్నట్టు చెప్పారు.