Chandrababu: మూడు రాజధానులపై తప్పును సరిదిద్దుకోవడం హర్షణీయం: చంద్రబాబు

  • ఏపీకి మూడు రాజధానులు ఉంటాయంటూ సహచట్టం దరఖాస్తుకు సమాధానం
  • అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి జీవీఆర్ శాస్త్రి లేఖ
  • ఏపీ రాజధాని అంశం న్యాయ పరిధిలో ఉందంటూ సవరణ
  • జీవీఆర్ శాస్త్రికి చంద్రబాబు అభినందన
Correcting mistake on three capitals is delightful says Chandrababu

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర హోంశాఖ ఇటీవల ఇచ్చిన సమాధానాన్ని సరిచేసుకోవడం హర్షణీయమని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. చైతన్యకుమార్‌రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఏపీ మూడు రాజధానుల అంశంపై కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేశారు.

దీనిపై ఆ శాఖ సీపీఐఓ డైరెక్టర్‌ రేణు సరిన్ ఈ నెల 6న సమాధానం ఇస్తూ.. అమరావతి ప్రస్తావన తీసుకురాకుండా, ‘ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం-2020’ కింద వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు పరిపాలన కేంద్రాలు ఉంటాయని, వీటిని రాజధానులు అంటారని వివరించారు. రాజధాని అంశాన్ని ఆ రాష్ట్రమే నిర్ణయించుకుంటుందని పేర్కొన్నారు.

కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఈ సమాధానంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అమరావతి జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్‌ జీవీఆర్ శాస్త్రి.. కేంద్ర హోంశాఖ అప్పిలేట్‌ అథారిటీ అయిన సంయుక్త కార్యదర్శి ప్రకాష్‌కు ఈనెల 9న లేఖ రాశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారం ఇచ్చారని అందులో పేర్కొన్నారు. రేణు సరిన్ పేర్కొన్న చట్టం ఇంకా అమల్లోకి రాలేదని గుర్తు చేశారు. రాజధాని అంశం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. స్పందించిన సరిన్.. గతంలో తానిచ్చిన సమాధానాన్ని సవరించారు. ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని స్పష్టం చేశారు.

దీనిపై స్పందించిన చంద్రబాబు.. కేంద్రం తప్పుగా ఇచ్చిన సమాధానాన్ని సరిచేసుకోవడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారి పట్టించి, వాస్తవాలను తారుమారు చేసినట్టు దీంతో స్పష్టమైందన్నారు. తప్పును సరిచేయించారంటూ జీవీఆర్ శాస్త్రిని అభినందించారు.

More Telugu News