Queen Ketevan: నాలుగు శతాబ్దాల క్రితం హత్యకు గురైన జార్జియా రాణి... ఛేదించిన భారత పరిశోధకులు

  • 1624 ప్రాంతంలో బందీగా రాణి కేతేవాన్ 
  • పదేళ్ల పాటు నిర్బంధించిన పర్షియా చక్రవర్తి
  • మతం మారాలని ఒత్తిడి
  • తన అంతఃపురంలో చేరాలని బలవంతం
  • అంగీకరించని రాణి కేతేవాన్
  • చిత్రహింసలకు గురిచేసిన చక్రవర్తి
Indian experts reveals Georgia Queen Ketevan

ప్రపంచలో సుదీర్ఘకాలం పాటు మిస్టరీగా ఉన్న కొన్ని ఉదంతాల్లో జార్జియా రాణి కేతేవాన్ హత్య ఒకటి. 400 ఏళ్ల క్రితం కేతేవాన్ మరణించారు. అయితే అది హత్య అని ఇన్నాళ్లకు తేలింది. అది కూడా భారత పరిశోధకులు ఈ మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఎక్కడో జార్జియాకు చెందిన రాచరికపు వ్యవహారంలో భారత పరిశోధకులు జోక్యం చేసుకోవడానికి బలమైన కారణమే ఉంది. రాణి కేతేవాన్ అవశేషాల్లో ఒకదానిని మనదేశంలోనే పూడ్చివేశారు. గోవాలోని సెయింట్ అగస్టీన్ కాన్వెంట్ లో తవ్వితీసిన ఆ అవశేషానికి డీఎన్ఏ పరీక్షలు చేస్తే అది రాణి కేతేవాన్ దేనని తేలింది.

అసలు, ఆమె మరణం వెనుక ఏం జరిగిందంటే... 1613లో పర్షియా చక్రవర్తి దండయాత్రలు చేపట్టి జార్జియాను కూడా జయించాడు. జార్జియా రాణి కేతేవాన్ ను ఇరాన్ లో పదేళ్ల పాటు బందీగా ఉంచాడు. ఆమెను మతం మారాలని, తన అంతఃపురంలో చేరాలని పర్షియా చక్రవర్తి హుకుం జారీ చేసినా, కేతేవాన్ ఆత్మాభిమానం ప్రదర్శించింది. చక్రవర్తి ఆదేశాలను పాటించలేదు. దాంతో పర్షియా రాజు ఆమెను తీవ్ర చిత్రహింసల పాల్జేశాడు. ఆ తర్వాత కొంతకాలానికే రాణి కేతేవాన్ మరణించింది.

రాణి మరణానికి కొంతకాలం ముందు ఇద్దరు అగస్టీనియన్ మత గురువులు రాణి కేతేవాన్ కు సహాయకులుగా మారారు. ఆమె మరణం తర్వాత వారిద్దరే ఆమె సమాధిని తవ్వి, ఆమె అవశేషాలను భద్రంగా ఉంచడం కోసం ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పూడ్చివేశారు. ఈ క్రమంలో ఆమె కుడిచేయి అవశేషాన్ని గోవాలో పూడ్చారు. దీనిపై జార్జియా ప్రభుత్వం నాడు సోవియెట్ యూనియన్ హయాంలోనే భారత ప్రభుత్వాన్ని కదిలించింది. రాణి కేతేవాన్ అవశేషాలను వెలికితీయడంలో సహాయపడాలని కోరింది.

ఈ నేపథ్యంలో అనేక ప్రయాసల అనంతరం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) గోవా విభాగం, స్థానిక చరిత్రకారులతో కలిసి తీవ్రంగా శోధించి 2004లో సెయింట్ అగస్టీన్ కాన్వెంట్ నిర్మాణం మ్యాప్ పై ఓ అంచనాకు వచ్చారు. దాని ఆధారంగా తవ్వకాలు చేపట్టగా, ఓ పొడవైన చేతి ఎముక, మరికొన్ని అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ దశలో భారత పరిశోధకులు సాంకేతిక పరిజ్ఞానం సాయం తీసుకున్నారు.

తమకు లభ్యమైన అవశేషాల్లో ఒకదాన్నుంచి మైటోకాండ్రియల్ డీఎన్ఏ ను వేరు చేసి, దాన్ని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయోలజీ) డేటా బ్యాంకులోని వేలాది డీఎన్ఏ సీక్వెన్స్ లతో పోల్చి చూశారు. అయితే అవి సరిపోలవకపోవడంతో, చేతి ఎముక నమూనాలను డేటా బ్యాంకు నమూనాలతో పోల్చిచూడగా, రాణి కేతేవాన్ డీఎన్ఏతో సరిపోలింది. ఈ క్రమంలో మరిన్ని పరిశోధనల ఆధారంగా... రాణి కేతేవాన్ ను 4 శతాబ్దాల కిందట గొంతుకోసి చంపారని భారత పరిశోధకులు గుర్తించారు.

ఏడేళ్ల సుదీర్ఘ దౌత్యప్రక్రియల అనంతరం, ఈ నెల 9న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ రాణి కేతేవాన్ అవశేషాలను, పరిశోధన సమాచారాన్ని జార్జియా ప్రభుత్వానికి అందజేశారు. కాగా, భారత పరిశోధకులు ఈ మర్డర్ మిస్టరీని ఛేదించిన వైనం 2014లోనే ఓ జర్నల్ లో ప్రచురితమైంది.

More Telugu News