చంద్రబాబు, నారా లోకేశ్ లకు తెలుగుపై అవగాహన ఉందా?: లక్ష్మీపార్వతి

14-07-2021 Wed 19:35
  • తెలుగు, సంస్కృత భాషలను విడదీయలేము
  • సంస్కృతంతో కూడిన తెలుగు భాషను ప్రజలు మాట్లాడుతున్నారు
  • అకాడమీ బైలా ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నాం
Does Chandrababu and Nara Lokesh has understanding on Telugu asks Lakshmi Parvati

తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మార్చడంపై తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి స్పందించారు. సంస్కృతంతో కూడిన తెలుగు భాషను ప్రజలు మాట్లాడుతున్నారని ఆమె చెప్పారు. సంస్కృత భాషను, తెలుగును విడదీయలేమని అన్నారు. తెలుగు-సంస్కృత అకాడమీని రాజకీయం చేయవద్దని కోరారు. అకాడమీ ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే స్పష్టంగా చెప్పాలని అన్నారు.

అసలు తెలుగు భాషపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లకు అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. తెలుగు అకాడమీ కోసం న్యాయ పోరాటం చేశామని చెప్పారు. తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలు రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు.
 
తెలుగు అకాడమీ ఏర్పాటు, విధివిధానాలకు సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటే... అకాడమీ బైలాను చదువుకోవాలని లక్ష్మీపార్వతి సూచించారు. తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రూపొందించిన బైలా ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.