అమిత్ షాకు రాష్ట్ర పరిస్థితులను వివరించాం: ఈటల రాజేందర్

14-07-2021 Wed 18:54
  • అమిత్ షాతో భేటీ అయిన బండి సంజయ్, ఈటల
  • తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని అమిత్ షా చెప్పారన్న ఈటల
  • హుజూరాబాద్ లో గెలిచేది బీజేపీనే అని ధీమా
Explained Telangana situation to Amit Shah says Etela Rajender

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన ఇద్దరు నేతలు అమిత్ షాతో సమావేశమయ్యారు. బీజేపీలో చేరిన తర్వాత అమిత్ షాతో ఈటల భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

భేటీ అనంతరం మీడియాతో ఈటల మాట్లాడుతూ, రాష్ట్ర పరిస్థితులను అమిత్ షాకు వివరించామని చెప్పారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని అమిత్ షా చెప్పారని అన్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎన్నిసార్లు అయినా రాష్ట్రానికి వస్తానని తెలిపారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఎంత డబ్బు ఖర్చు చేసినా హుజూరాబాద్ లో గెలిచేది బీజేపీనే అని అన్నారు. మరోవైపు అమిత్ షాను బండి సంజయ్, ఈటలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ కూడా కలిశారు.