ఏపీ కృషిని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది: పేర్ని నాని

14-07-2021 Wed 18:41
  • కరోనా విషయంలో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
  • కరోనాను కట్టడి చేయడంలో ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోంది
  • ఇచ్చిన మాటను తప్పడం చంద్రబాబు నైజం
The central government also lauded the efforts of the AP in controlling Corona says Perni Nani

కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీ చేస్తున్న కృషిని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందని చెప్పారు. కానీ కరోనా విషయంలో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పరామర్శ కోసం మచిలీపట్నంకు వచ్చిన చంద్రబాబు, రాజకీయాలు మాట్లాడారని దుయ్యబట్టారు. ఆయన పరామర్శ కోసం వచ్చారా? లేక పాత లెక్కలు తేల్చుకోవడానికి వచ్చారా? అని ప్రశ్నించారు.

ఇచ్చిన మాటను తప్పడం చంద్రబాబు నైజమని పేర్ని నాని అన్నారు. 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిలో ఒకటైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. కానీ జగన్ మాత్రం 20 నెలల్లోనే 97 శాతం హామీలను నెరవేర్చారని చెప్పారు. బెల్ట్ షాపులకు ప్రాణం పోసింది చంద్రబాబేనని అన్నారు. గిరిజనులకు చంద్రబాబు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న జల దోపిడీపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.