గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద మహిళ ఆందోళన.. నిర్మాత బన్నీ వాసుపై ఆరోపణలు

14-07-2021 Wed 18:24
  • హంగామా సృష్టించిన సునీత అనే మహిళ
  • అవకాశాల పేరిట బన్నీ వాసు మోసం చేశాడన్న సునీత
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన గీతా ఆర్ట్స్ మేనేజర్
  • సునీతను జడ్జి ఎదుట హాజరుపరిచిన పోలీసులు
Woman creates ruckus at Geetha Arts office in Hyderabad

హైదరాబాదులోని గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద ఇవాళ ఓ మహిళ తీవ్ర కలకలం రేపింది. ఆమె పేరు బోయ సునీత. ఇటీవల లాక్ డౌన్ సమయంలో ఆమె మలక్ పేట ప్రాంతంలో పుచ్చకాయలు అమ్ముతూ మీడియాలో ప్రముఖంగా కనిపించింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని, ఆత్మహత్య చేసుకుంటానంటూ గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట హంగామా సృష్టించింది. దాంతో గీతా ఆర్ట్స్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సునీత మానసిక పరిస్థితి సరిగా లేదని వారు న్యాయమూర్తికి తెలిపారు.

సునీత... నిర్మాత బన్నీ వాసుపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. సినిమా అవకాశాల పేరిట బన్నీ వాసు తనను వంచించాడని ఆమె పలుమార్లు ఆరోపణలు చేశారు. దాంతో బన్నీ వాసు, ఆయన వర్గీయులు సునీతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెను పలుమార్లు జైలుకు, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి కూడా తరలించారు.

ఇటీవలే సునీత మరోసారి తెరపైకి వచ్చింది. బన్నీ వాసు తనను బెదిరిస్తున్నాడని, ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. సునీత... లాక్ డౌన్ సమయంలో సినిమా అవకాశాలు లేకపోవడంతో, నగరంలో పుచ్చకాయలు అమ్ముతూ దర్శనమిచ్చారు. సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆత్మగౌరవంతో బతుకుతోందంటూ సునీతను చాలామంది అభినందించారు. ఇటీవలే తాను వైఎస్ షర్మిల పార్టీలో చేరుతున్నానంటూ ఓ వీడియో వెల్లడించింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం సందర్భంగా సునీత ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసింది.