తెలుగు-సంస్కృతం అకాడమీని ఏర్పాటు చేయడానికి కారణం ఇదే: ఆదిమూలపు సురేశ్

14-07-2021 Wed 18:19
  • తెలుగు భాషను అభివృద్ది చేసేందుకే కొత్త అకాడమీ
  • తెలుగు, సంస్కృతాన్ని వేర్వేరుగా చూడలేము
  • తెలుగు భాష మూలాలను తెలుసుకోవడానికి లోతుగా పరిశోధన చేయాలి
Telugu Sanskrit academy is created to develop Telugu language says Adimulapu Suresh

తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని కూడా కలిపి తెలుగు-సంస్కృత అకాడమీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే విపక్షాలకు అభ్యంతరం ఎందుకో అర్థం కావడం లేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. తెలుగు భాషను మరింత విస్తృత పరిచేందుకు, అభివృద్ది పరిచేందుకే కేబినెట్ లో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

భారతీయ భాషలకు సంస్కృతం మూలమని... తెలుగుపై సంస్కృతం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈ రెండు భాషలను వేర్వేరుగా చూడలేమని చెప్పారు. తెలుగు భాష మూలాలను తెలుసుకోవాలంటే లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంటుందని అన్నారు.
 
తెలుగు అకాడమీ అంటే తెలుగుదేశం పార్టీ అకాడమీ కాదనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలని ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై చేసిన విమర్శలను టీడీపీ నేతలు సరిదిద్దుకోవాలని అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్లలో ఏపీలో తెలుగు అకాడమీని ఏర్పాటు చేయలేకపోయారని... అందుకే రెండింటినీ కలిపి తెలుగు-సంస్కృత అకాడమీని ఏర్పాటు చేశామని చెప్పారు.