'హైవే'పైకి వచ్చేసిన మానస రాధాకృష్ణన్!

14-07-2021 Wed 18:18
  • గుహన్ దర్శకత్వంలో 'హైవే'
  • రోడ్ క్రైమ్ థ్రిల్లర్ గా సాగే కథ 
  • కొత్త కథానాయిక పరిచయం 
  • రీసెంట్ గా మొదలైన రెగ్యులర్ షూటింగ్       
Highway movie shooting started

ఆనంద్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'పుష్పక విమానం' విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. వాటిలో కేవీ గుహన్ దర్శకత్వంలోని సినిమా ఒకటి. ఇది రోడ్ క్రైమ్ డ్రామా .. అనుక్షణం ఉత్కంఠను రేపే సన్నివేశాలతో కొనసాగుతుంది. కరోనా ప్రభావం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూసిన ఈ సినిమా టీమ్, తాజాగా రంగంలోకి దిగిపోయింది. ప్రస్తుతం నాయకా నాయికల కాంబినేషన్ లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
 
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన నాయికగా 'మానస రాధాకృష్ణన్' ను తీసుకున్నారు. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన మానస, ఇప్పుడిప్పుడే అక్కడ కథానాయికగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పవన్ - హరీశ్ శంకర్ సినిమాలో ఈ అమ్మాయే హీరోయిన్ అనే టాక్ బలంగానే వినిపించింది. అలా ఈ అమ్మాయి ఇక్కడివారికి పరిచయమైంది. చక్కని కనుముక్కుతీరుతో అందంగా .. ఆకర్షణీయంగా ఉన్న మానస, ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ రెగ్యులర్ షూటింగులో పాల్గొంటోంది. మరి మానస కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.