'రాక్షసుడు' సీక్వెల్ లో హీరోగా విజయ్ సేతుపతి?

14-07-2021 Wed 16:21
  • బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన 'రాక్షసుడు'
  • దీనికి సీక్వెల్ చేస్తున్న దర్శకుడు రమేశ్ వర్మ
  • చెన్నై వెళ్లి విజయ్ కు కథ వినిపించిన దర్శకుడు
  • కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్  
 Vijay Setupati to play hero in Rakshasudu sequel

తమిళ సినీ కథానాయకుడు విజయ్ సేతుపతికి ఓ ప్రత్యేకత వుంది. అదేమిటంటే, తాను పలు సినిమాలలో కథానాయకుడుగా నటిస్తున్నప్పటికీ.. మిగతా హీరోలలా కాకుండా, ఇతర హీరోల సినిమాల నుంచి మంచి క్యారెక్టర్లు వస్తే కనుక ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేస్తాడు. ఆ విధంగా తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలలో పలు పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఈ క్రమంలో ఇప్పుడు తెలుగులో ఓ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ విజయ్ కి వచ్చినట్టుగా తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'రాక్షసుడు' చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చేసే ప్రయత్నాలను దర్శకుడు రమేశ్ వర్మ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్ననే ఈ 'రాక్షసుడు 2' చిత్రం పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడీ చిత్రంలో హీరోగా విజయ్ సేతుపతి నటించనున్నట్టు తాజా సమాచారం.

ఇటీవల దర్శకుడు రమేశ్ వర్మ చెన్నై వెళ్లి, విజయ్ సేతుపతికి ఈ చిత్రకథ వినిపించాడని, అది ఆయనకు బాగా నచ్చిందని అంటున్నారు. దాంతో ఈ చిత్రం తప్పకుండా చేస్తానని విజయ్ హామీ ఇచ్చాడట. ప్రస్తుతం తాను చేస్తున్న చిత్రాల డేట్స్ ను బట్టి, ఈ 'రాక్షసుడు 2'కి డేట్స్ కేటాయిస్తాడని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావచ్చు.