KTR: టీఆర్ఎస్ లో ఉంటూనే ఇతర పార్టీలతో ఈటల సంప్రదింపులు జరిపారు: కేటీఆర్

  • ఈటలకు టీఆర్ఎస్ అన్యాయం చేయలేదు
  • 2003లో కష్టమైనా ఈటలకు టికెట్ ఇచ్చాం
  • హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది
KTR comments on Etela Rajender

టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ పై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈటలకు టీఆర్ఎస్ అన్యాయం చేయలేదని అన్నారు. 2003 ఎన్నికల్లో ఎంతో కష్టమైనా ఈటలకు టికెట్ ఇచ్చామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలో పదవులను అనుభవిస్తూనే... ఇతర పార్టీలతో ఈటల సంప్రదింపులు జరిపారని దుయ్యబట్టారు.

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అక్కడే మాట్లాడితే పోయేదని... అయితే సానుభూతి కోసం ప్రజల దగ్గర మాట్లాడి పార్టీకి ఆయనే దూరమయ్యారని చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ పార్టీల మధ్యే ఉంటుందని, వ్యక్తుల మధ్య కాదని అన్నారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో బండి సంజయ్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఏడేళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం ఈ దేశానికి ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యపై తప్ప విపక్షాలకు మాట్లాడేందుకు మరో అంశం లేదని చెప్పారు.

More Telugu News