ఆయన్ను నమ్ముకున్నోళ్లంతా జైలుకెళ్లారు: జగన్ పై చంద్రబాబు విమర్శ

14-07-2021 Wed 14:29
  • కరోనాను కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది
  • టీడీపీ అధికారంలో ఉంటే కరోనాను ఎదుర్కొనేవాళ్లం
  • పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంతో కాలం పాలించలేరు
All who believed Jagan gone to Jail says Chandrababu

తెలుగుదేశం హయాంలో ఎన్నో సంక్షోభాలు వచ్చినా, వాటిని సవాలుగా తీసుకుని పని చేశామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కరోనాని కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉంటే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేవాళ్లమని చెప్పారు. మచిలీపట్నంలో ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి నరసింహారావు కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్లి నరసింహారావు చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. కొల్లు రవీంద్రకు నరసింహారావు మామ అవుతారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రైతుల వద్ద ధాన్యాన్ని కొన్న ప్రభుత్వం వారికి డబ్బులు ఇవ్వలేదని చంద్రబాబు అన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే మంత్రులు, ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని విమర్శించారు. తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని కొంత కాలం మాత్రమే పాలించగలరని... రైతులు తిరగబడితే తట్టుకోలేరని హెచ్చరించారు. పోలీసులు కూడా హుందాగా పని చేయాలని అన్నారు. ఆయనను నమ్ముకున్నోళ్లంతా జైలుకు వెళ్లారని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన కోసం తప్పులు చేస్తే మీ పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారవుతుందని అన్నారు.