Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో మ‌రోసారి డ్రోన్ కలకలం

  • గ‌త‌ రాత్రి  ఆర్నియా అంతర్జాతీయ సరిహద్దు వ‌ద్ద క‌న‌ప‌డ్డ డ్రోన్
  • భారత భూభాగంలోకి దాదాపు 150 మీట‌ర్ల‌మేర చొచ్చుకొచ్చిన వైనం
  • భార‌త్‌ కాల్పులు జ‌ర‌ప‌డంతో వెన‌క్కి
  • సుమారు రెండువందల మీటర్ల ఎత్తులో సంచ‌రించిన‌ట్లు గుర్తింపు
BSF Spots Another Drone In Jammu

జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో మ‌రోసారి ఓ డ్రోన్ తిర‌గ‌డం కలకలం రేపింది. గ‌త‌ రాత్రి ఆర్నియా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భారత భూభాగంలోకి దాదాపు 150 మీట‌ర్ల‌మేర చొచ్చుకుని వ‌చ్చింది. ఆ ప్రాంతంలో ఎగురుతున్న డ్రోన్‌ను గుర్తించిన బీఎస్ఎఫ్ జ‌వాన్లు దానిపై కాల్పులు జరపడంతో అది కొద్దిసేప‌టికే వెనుదిరిగింది.

భార‌త స‌రిహ‌ద్దుల్లోని ప‌రిస్థితుల‌ను గుర్తించేందుకు లేదా ఆయుధాలు, మందు గుండు సామ‌గ్రిని జార విడిచేందుకు పాక్ ఆ డ్రోనును పంప‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. భారత భూభాగంలో సుమారు రెండువందల మీటర్ల ఎత్తులో అది సంచ‌రించిన‌ట్లు అధికారులు గుర్తించారు. అనంత‌రం ఆ డ్రోను తిరిగిన‌ ప్రాంతంలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ‌త 15 రోజుల వ్య‌వ‌ధిలో ఇటువంటి డ్రోన్లు క‌న‌ప‌డ‌డం ఇది ఆరో సారి.

అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత ప్రాదేశిక భూభాగంలోకి డ్రోన్లను పంపేందుకు ప‌దే ప‌దే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం‌తో భార‌త సైన్యం రక్షణ చ‌ర్య‌లు తీసుకుంటోంది. కొన్ని రోజుల క్రితం జ‌మ్మూక‌శ్మీర్‌లోని ఎయిర్‌పోర్టులోని ఐఏఎఫ్ స్థావ‌రంపై డ్రోన్ల‌తో దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే.

అనంత‌రం కూడా ప‌లు ప్రాంతాల్లో డ్రోన్లు సంచ‌రిస్తూ క‌న‌ప‌డ‌డంతో వాటిపై కాల్పులు జ‌రిపి భార‌త సైన్యం వాటిని త‌రిమేసింది. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మందు గుండు సామ‌గ్రి, డ్ర‌గ్స్ వంటివి జార‌విడిచే అవ‌కాశాలు ఉండ‌డంతో అవి సంచ‌రించిన ప్రాంతాల్లో జ‌వాన్లు వెంట‌నే గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

More Telugu News