తెలంగాణ తీరును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం

14-07-2021 Wed 12:08
  • కృష్ణా జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం
  • తాగు, సాగు నీటిని తమకు దక్కకుండా చేస్తోందని ఏపీ పిటిషన్
  • విభజన చట్టాన్ని కూడా టీఎస్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపణ
AP govt files petition in Supreme Court againt Telangana in Krishna water dispute

కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాటాకు మించి అక్రమంగా నీటిని వాడుకుంటున్నారని రెండు రాష్ట్రాలు ఆరోపించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ కూడా రాశారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. తమకు న్యాయంగా దక్కాల్సిన వాటాకు తెలంగాణ ప్రభుత్వం గండి కొడుతోందని సుప్రీంలో పిటిషన్ వేసింది.

కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం కోరింది. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. తాగు, సాగు నీటిని ఏపీ ప్రజలకు దక్కకుండా చేస్తూ... తమ రాష్ట్ర ప్రజల హక్కులను తెలంగాణ కాలరాస్తోందని తెలిపింది. విభజన చట్టాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని చెప్పింది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును అనుసరించడం లేదని తెలిపింది. జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది.