Nirmal District: నిర్మల్ జిల్లాలో సర్పంచ్ ఘాతుకం.. ఉపాధిహామీ ఉద్యోగిపై పెట్రోలు పోసి నిప్పు

  • పనులు చేయకుండానే బిల్లులపై సంతకాలు పెట్టమన్న సర్పంచ్
  • తాను పెట్టబోనన్న ఉపాధిహామీ సాంకేతిక సహాయకుడు
  • వాగ్వివాదం జరగడంతో పెట్రోలు పోసి నిప్పు
Sarpanch Poured petrol on EGS employee and set him on fire

ఉపాధిహామీ ఉద్యోగిపై పెట్రోలు పోసి నిప్పంటించాడో సర్పంచ్. నిర్మల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తీవ్రంగా గాయపడిన ఉద్యోగి ప్రస్తుతం నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. జిల్లాలోని కుభీరు మండలం పాత సాంవ్లీ గ్రామ సర్పంచ్ సాయినాథ్ నిన్న సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఉపాధిహామీ కార్యాలయానికి వెళ్లాడు.

అక్కడున్న సాంకేతిక సహాయకుడైన రాజును మస్టర్లపై సంతకాలు చేయాలని కోరాడు. అందుకు అతడు నిరాకరించాడు. పనులు చేయకుండానే సంతకాలు చేయాలనడం సరికాదని, తాను పెట్టేది లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ముందస్తు ప్లాన్ ప్రకారం వస్తూవస్తూ వెంట పెట్రోలు తెచ్చుకున్న సర్పంచ్ దానిని రాజుపై పోసి నిప్పంటించాడు.

కార్యాలయంలో ఉన్న మిగతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు. అయితే, అప్పటికే రాజు చేతులు, చాతీ భాగంలో తీవ్రగాయాలయ్యాయి. దాడి విషయం బయట పడకుండా ఉండేందుకు సర్పంచ్ అనుచరులు బాధితుడు రాజును వెంటనే భైంసాలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాజుపై పెట్రోలు పోసి దాడికి పాల్పడిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఈజీఎస్ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు, సర్పంచ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజు చేసిన తప్పులపై విచారణ జరిపించాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా, రాజును భైంసా నుంచి నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన వైద్యం కోసం అతడిని హైదరాబాద్ పంపిస్తామని ఇన్‌చార్జ్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, కలెక్టర్ ముషారఫ్ అలీ హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News