Sundar Pichai: ప్రజాస్వామ్య దేశాలు ఇంట‌ర్నెట్‌ విచ్ఛిన్నతకు ఎదురొడ్డాలి!: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్

  • పలు దేశాల్లో ఇంట‌ర్నెట్‌ దాడికి గురవుతోంది
  • బలమైన ప్రజాస్వామ్య దేశాలు దీనిపై దృష్టి పెట్టాలి
  • ఎలాంటి స‌మాచారాన్ని అనుమతించాలన్న దానిపై ఇప్పుడు ప్రతి దేశంలో చర్చ
  • తనలో భారతీయ మూలాలు బలంగా ఉన్నాయన్న సుందర్ 
sundar pichai on internet usage

ప్ర‌స్తుతం ఇంటర్నెట్ వినియోగ విస్తృతి భారీగా పెరిగిపోయింది. గ్రామీణులు కూడా ఇంట‌ర్నెట్‌ను బాగా వాడేస్తున్నారు. అయితే, ప‌లు దేశాల్లో దాని వినియోగంపై ఉన్న ఆంక్ష‌లు, నిఘా వంటి అంశాల‌పై గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తాజాగా, ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... పలు దేశాల్లో ఇంటర్నెట్ దాడికి గురవుతోందని, బలమైన ప్రజాస్వామ్య మూలాలు ఉన్న దేశాలు ఇంట‌ర్నెట్‌ విచ్ఛిన్నతకు ఎదురొడ్డాలని కోరారు.

ఇంట‌ర్నెట్ వేదిక‌గా ఎలాంటి స‌మాచారాన్ని అనుమతించాలన్న దానిపై ఇప్పుడు ప్రతి దేశంలోనూ చర్చ జరుగుతోందని చెప్పారు. ఇంట‌ర్నెట్‌లో సమాచార విస్తృతిని నిరోధించేందుకు చాలా దేశాలు ఇప్పుడు ఆంక్షలు విధించాయన్నారు. ఉచితంగా, ఎలాంటి నియంత్ర‌ణ‌లు లేకుండా అందించే ఇంట‌ర్నెట్ మంచిని పెంచేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, ఇటువంటి వ్య‌వ‌హారాన్ని అడ్డుకోవడమంటే వెనక్కి వెళ్లడమేన‌ని తెలిపారు. తాను అమెరికా పౌరుడిని అయిన‌ప్ప‌టికీ త‌న‌లో భారతీయ మూలాలు బలంగా ఉన్నాయ‌ని చెప్పారు.

భారత స‌ర్కారు ఇటీవ‌ల కొత్త‌ ఐటీ నిబంధనలను తీసుకొచ్చిన నేప‌థ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం మ‌న‌కు నిప్పు, విద్యుత్తు, ఇంటర్నెట్‌ ఎంత అవసరమో భవిష్యత్తులో ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ అంతకు మించిన అవసరమవుతుందని ఆయ‌న చెప్పారు.

25 ఏళ్ల‌లో ఏఐతో పాటు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగాల్లో సాధించనున్న‌ ప్రగతి ప్రపంచ వ్యాప్తంగా పెను మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. ఆయా వ్యవస్థలు మనుషుల కంటే గొప్ప‌గా సమస్యలను పరిష్కరిస్తున్నాయని చెప్పారు. చైనాలో ప‌రిస్థితుల గురించి ఆయ‌న మాట్లాడుతూ గూగుల్‌కు సంబంధించిన ప్రధాన ఉత్పత్తులేవీ ఆ దేశంలో అందుబాటులో లేవన్నారు.

More Telugu News