England: యూరో కప్ ఫైనల్‌లో ఓడిన ఇంగ్లండ్ ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు.. ఖండించిన ప్రధాని జాన్సన్

  • పెనాల్టీ షూటవుట్‌లో ఓడిన ఇంగ్లండ్
  • ముగ్గురు ఆటగాళ్లపై సోషల్ మీడియాలో జాత్యహంకార వ్యాఖ్యలు
  • ఓడిపోయిన వారిని నిందించడం దుర్మార్గపు చర్య అన్న ప్రధాని 
Boris Johnson Responds Hate Speach on England footballers

ఇటలీతో హోరాహోరీగా జరిగిన యూరోకప్ ఫైనల్‌లో ఇంగ్లండ్ ఓటమి పాలవడాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌ తొలుత 1-1తో డ్రా కాగా, పెనాల్టీ షూటవుట్‌లో ఇంగ్లండ్ బోర్లా పడింది. జట్టులోని ముగ్గురు నల్ల జాతీయులైన ఆటగాళ్లు.. మార్కస్ రష్‌ఫోర్డ్, బుకాయో సకా, జడాన్ సాంచోలు పెనాల్టీ కిక్స్‌ను గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యారు. దీంతో ఇటలీ 3-2తో విజయం సాధించి కప్‌ను ఎగరేసుకుపోయింది.

ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఇంగ్లండ్  సాకర్ అభిమానులు పెనాల్టీ కార్నర్స్‌ను గోల్స్‌ చేయలేకపోయిన నల్లజాతీయులు ముగ్గురిపై సోషల్ మీడియాలోను, బయట జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్రంగా స్పందించారు. ఓడిపోయిన వారిని నిందించడం దుర్మార్గపు చర్య అన్నారు. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినవారు తమకు తామే సిగ్గుపడాలంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు, ఇంగ్లండ్ ఫుట్‌బాల్ సంఘం కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఇది కచ్చితంగా దుష్ప్రవర్తనేనని పేర్కొంది. ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన వారిపై దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇంగ్లండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా తీవ్రంగా స్పందించాడు. ఆటగాళ్లను దూషిస్తే మనకు ఆనందం కలుగుతుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2030 ప్రపంచకప్‌కు మనం అసలు అర్హులమేనా? అని ప్రశ్నించాడు.

More Telugu News