Manchu Vishnu: 'మా' అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా: మంచు విష్ణు

  • బహుముఖ పోరుగా 'మా' అధ్యక్ష ఎన్నికలు
  • బరిలో మంచు విష్ణు
  • ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని డిమాండ్
  • సినీ పెద్దలు జోక్యం చేసుకోవాలని వినతి
Manchu Vishnu wrote another letter on MAA elections

మునుపెన్నడూ లేనంతగా ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు బహుముఖ పోరుగా మారాయి. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్, జీవిత, హేమ వంటి హేమాహేమీలు బరిలో ఉండడంతో 'మా' రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో, తాజాగా మంచు విష్ణు స్పందించారు. 'మా' అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని డిమాండ్ చేశారు. టాలీవుడ్ సినీ పెద్దలు స్పందించి 'మా' అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఒకవేళ ఏకగ్రీవం చేయకపోతే తాను పోటీలో కొనసాగుతానని తెలిపారు. ఈ మేరకు మంచు విష్ణు లేఖ రాశారు.

"ప్రతి ఎన్నికల్లో 'మా' భవనం ప్రధాన అజెండా అవుతోంది. 'మా' అసోసియేషన్ భవనాన్ని నేను, మా కుటుంబ సభ్యులు కట్టిస్తాం" అని వెల్లడించారు. 'మా'లో సభ్యత్వం లేనివారికీ అవకాశాలు వస్తున్నాయని ఆరోపించారు. 'మా'లో సభ్యత్వం ఉన్నవారికే అవకాశాలు ఇవ్వాలని, తద్వారా 'మా'ను గౌరవించాలని డిమాండ్ చేశారు. ప్రతి నటుడు 'మా' సభ్యత్వం తీసుకోవాలని, నిర్మాతలు, ఓటీటీలు కూడా 'మా' సభ్యులకే అవకాశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.

More Telugu News