Vijayashanti: ఏ పని చేసినా జనాన్ని ముంచడమే... ఈ సర్కారుకు ముంపు ముప్పు దగ్గర్లోనే ఉంది: విజయశాంతి

  • వర్షాలకు వరంగల్ జలమయమైందన్న విజయశాంతి
  • గతేడాది కూడా ఇలాగే జరిగిందని వెల్లడి
  • అరకొర చర్యలు అంటూ విమర్శలు
  •  సర్కారు తీరు ఇంతేనని వ్యాఖ్యలు
Vijayasanthi attacks on TRS govt

తెలంగాణ బీజేపీ మహిళా నేత విజయశాంతి టీఆర్ఎస్ సర్కారుపై మరోసారి ధ్వజమెత్తారు. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఇతర ప్రజాప్రతినిధులు చెప్పే కల్లబొల్లి కబుర్లలోని మాయలేంటో జంటనగరాల ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. వర్షాలు పడితే కాల్వల్ని తలపించే హైదరాబాద్, సికింద్రాబాద్ వీధులు, నాలాల బారినపడి జనం విలవిల్లాడుతుంటారని వివరించారు. అయితే వర్షాలు తగ్గగానే ఈ సమస్యలు మళ్లీ తలెత్తకుండా చూస్తామని ఏడేళ్లుగా ఈ పాలకులు చెబుతుండడం, ప్రజలు వింటుండడం పరిపాటిగా మారిందని తెలిపారు.

అధికార పార్టీ నేతలు ఇప్పుడు వరంగల్ నగరానికి కూడా ఇదే అనుభవాన్ని అందిస్తున్నారని ఆరోపించారు. గతేడాది భారీ వర్షాలతో వరంగల్, పరిసర ప్రాంతాలు జలమయం అవ్వడంతో, అప్పుడు కేటీఆర్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ వంటి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటన చేశారని, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, చర్యలు తీసుకుని ముంపు ముప్పు తగ్గిస్తామని చెప్పారని విజయశాంతి గుర్తుచేశారు.

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ మళ్లీ భీతిల్లిపోయే పరిస్థితి వచ్చిందని వివరించారు. ఆక్రమణల కూల్చివేతలు అరకొరగా సాగుతున్నాయని, నాలాలపై ఆక్రమణల తొలగింపు ఊసేలేదని విమర్శించారు. రోడ్ల కంటే డ్రైనేజీలు ఎత్తుగా కడుతూ చారిత్రక వరంగల్ నగరాన్ని మరింత మురికి కూపంగా మార్చేశారని మండిపడ్డారు. ఏ పని చేసినా జనాన్ని ముంచడమే తప్ప మంచి చేయడం తెలియని ఈ ప్రభుత్వానికి ముంపు ముప్పు దగ్గర్లోనే ఉందని విజయశాంతి హెచ్చరించారు.

More Telugu News