Peddireddi Ramachandra Reddy: చంద్రబాబు హయాంలో తవ్వితే లేటరైట్... ఇప్పుడు తవ్వితే బాక్సైట్ అయ్యిందా?: మంత్రి పెద్దిరెడ్డి

  • ఇటీవల విశాఖ మన్యంలో టీడీపీ నేతల పర్యటన
  • లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలంటూ ఆరోపణ
  • చంద్రబాబు హయాంలోనే అక్రమ మైనింగ్ జరిగిందన్న పెద్దిరెడ్డి
  • మన్యంలో ఎక్కడా బాక్సైట్ తవ్వకాలు లేవన్న మంత్రి  
Minister Peddireddy opines on Laterite mining in state

ఇటీవల విశాఖ మన్యం ప్రాంతంలో పర్యటించిన టీడీపీ నేతలు లేటరైట్ తవ్వకాల ముసుగులో బాక్సైట్ తవ్వకాలు చేపడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. దీనిపై ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. టీడీపీ అసత్యప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్ పదవిలోకి వచ్చాక బాక్సైట్ తవ్వకాల జీవోలను శాశ్వతంగా రద్దు చేశారని వెల్లడించారు. న్యాయస్థానం ఆదేశాలతో లేటరైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు.

చంద్రబాబు హయాంలో కూడా లేటరైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారని, మరి నాడు తవ్వితే లేటరైట్... ఇప్పుడు తవ్వితే బాక్సైట్ అయ్యిందా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో అక్రమంగా 2 లక్షల టన్నులు అక్రమ మైనింగ్ చేస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.20 కోట్ల మేర జరిమానా విధించామని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు.

అయినా, టీడీపీ నేతలు లేటరైట్ గనులను సందర్శిస్తే ఏమొస్తుందని అన్నారు. టీడీపీ నేతలేమైనా మైనింగ్ నిపుణులా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలవన్నీ తప్పుడు ఆరోపణలేనని, విశాఖ మన్యంలో ఎక్కడా బాక్సైట్ తవ్వకాలు చేపట్టడంలేదని స్పష్టంచేశారు.

More Telugu News