జనాభా పెరగడానికి ఆమిర్​ లాంటి వారే కారణం: బాలీవుడ్​ హీరోపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

12-07-2021 Mon 14:54
  • మొదటి భార్యతో ఇద్దరు.. రెండో భార్యతో ఒక సంతానం
  • ఇప్పుడు మూడో భార్య కోసం వెతుక్కుంటున్నారు
  • దేశ భూభాగం పెరగకున్నా.. జనాభా మాత్రం పెరిగింది
BJP MP Controversial Comments On Bollywood Star Hero Amir Khan

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ పై బీజేపీ ఎంపీ (మధ్యప్రదేశ్ మాండ్సర్) సుధీర్ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా పెరిగిపోవడానికి ఆమిర్ ఖాన్ లాంటి వారే కారణమని అన్నారు. మొదటి భార్య రీనాతో ఆమిర్ ఇద్దరు పిల్లలను కన్నాడని, రెండో భార్య కిరణ్ తో ఒక సంతానం ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మూడో భార్య కోసం వెతుక్కుంటున్నారన్నారు.

ప్రపంచానికి భారత్ ఇచ్చే సందేశం ఇదేనా? అని వ్యాఖ్యానించారు. దేశంలో జనాభా అసమానతలకు ఆమిర్ ఖాన్ లాంటి వారే కారణం కావడం దురదృష్టకరమన్నారు. జనాభా దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో భారత భూభాగం పెరగకపోయినా.. జనాభా మాత్రం పెరిగిపోయిందన్నారు.

అది దేశానికి ఏ మాత్రం మంచిదికాదన్నారు. దేశ విభజన సమయంలో ఎక్కువ భూభాగం, తక్కువ జనాభాతో పాకిస్థాన్ ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. కాబట్టి జనాభా నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.