Team India: కోహ్లీ కెప్టెన్సీపై రైనా ఆసక్తికర కామెంట్లు

  • వరల్డ్ కప్ ల దాకా ఎందుకు.. ఒక్క ఐపీఎల్ కప్పూ గెలవలేదు
  • కెప్టెన్ గా కోహ్లీకి మరింత సమయం కావాలి
  • కచ్చితంగా ఏదో ఒక రోజు కప్పు కొడతాడు
Raina Take On Virat Kohli Captaincy

విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆసక్తికర కామెంట్లు చేశాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో ఓటమి తర్వాత విమర్శకులు అతడిపై బాణాలు ఎక్కుపెట్టారు. కెప్టెన్సీ నుంచి కోహ్లీ దిగిపోవాలన్న వాదనలు తెరపైకి వచ్చాయి. కొందరు మద్దతుదారులు మాత్రం కోహ్లీ కెప్టెన్సీలో 33 టెస్టులు గెలిచామని, దిగిపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

అయితే, తాజాగా సురేశ్ రైనా కూడా తన అభిప్రాయం చెప్పాడు. కోహ్లీకి కెప్టెన్ గా ఇంకాస్త సమయమివ్వాలని అన్నాడు. ఏదో ఒకరోజు కోహ్లీ నేతృత్వంలోని జట్టు కచ్చితంగా ఐసీసీ ట్రోఫీని గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ‘‘నా దృష్టిలో అతడు నంబర్ 1 కెప్టెన్. నంబర్ వన్ బ్యాట్స్ మన్. అతడు ఎంతో సాధించాడని అతడి రికార్డులే చెబుతాయి. అందరూ అతడు ఐసీసీ ట్రోఫీ నెగ్గలేదని మాట్లాడుతున్నారు.. అసలు ఇప్పటిదాకా ఒక్క ఐపీఎల్ కప్పునైనా కోహ్లీ గెలవలేదు’’ అని చెప్పుకొచ్చాడు.

వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా వెళ్లామంటేనే గొప్పని, కొన్ని చిన్న తప్పుల వల్ల చేజారినంత మాత్రాన నిందలు వేయడం సరికాదని అన్నాడు. రాబోయే రోజుల్లో వరుసగా 2 వరల్డ్ కప్ లు అతి సమీపంలోనే ఉన్నాయన్న రైనా.. ఏదో ఒక కప్ ను భారత్ గెలుస్తుందన్నాడు.

More Telugu News