Gold: కరోనా తెచ్చిన కష్టం.. పూట గడిచేందుకు బంగారం అమ్మేస్తున్నారు!

  • పాత బంగారం అమ్మకాలు 215 టన్నులు
  • మణప్పురం ఫైనాన్స్ లో రూ.404 కోట్ల బంగారం వేలం
  • దక్షిణ భారత దేశంలో 25% పెరుగుదల
Indians Selling Gold For Their End Meets

కరోనా మహమ్మారి ఎంతో మందిని కడు పేదరికంలోకి నెట్టేసింది. చాలా మంది ఉద్యోగాలను కోల్పోయి పూట గడవని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. సొంత బిజినెస్ లు పెట్టుకున్నా అవి సరిగ్గా నడవక, వేరే జాబ్ రాక కష్టాలు అనుభవిస్తున్నారు. దీంతో కొందరు ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మేస్తున్నారు. ఇంకొందరు కుదవ పెట్టి రుణాలు తీసుకుంటున్నారు.

2020తో పోలిస్తే ఈ ఏడాది బంగారం మీద రుణాలు తీసుకోవడం భారీగా పెరిగే అవకాశం ఉందని లండన్ కు చెందిన మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ అనే సంస్థ కన్సల్టెంట్ చిరాగ్ సేఠ్ చెప్పారు. పాత బంగారం అమ్మకాలు 215 టన్నులు దాటొచ్చని అంచనా వేశారు. తొమ్మిదేళ్లలో ఇదే అత్యధికమని ఆయన చెబుతున్నారు. అయితే, థర్డ్ వేవ్ ముప్పు వస్తే మాత్రం ఆగస్టు, సెప్టెంబర్ లలో వినియోగదారులు బంగారం కొనడం భారీగా తగ్గుతుందని, అదే సమయంలో పాత బంగారం అమ్మకాలు పెరిగే చాన్స్ ఉందని చెప్పారు.

కాగా, గత మూడు నెలల్లోనే దేశంలోనే అతిపెద్ద బంగారం రుణాలిచ్చే సంస్థ అయిన మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్.. సుమారు రూ.404 కోట్ల విలువైన బంగారాన్ని వేలం వేసింది. అంతకుముందు తొమ్మిది నెలల్లో కేవలం 8 కోట్ల రూపాయల విలువైన బంగారాన్నే సంస్థ వేలం వేసింది. అంటే సెకండ్ వేవ్ తర్వాత ఎంత మంది తమ బంగారాన్ని అమ్మేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ రైతులు, చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, కార్మికులే ఎక్కువగా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

దక్షిణ భారతదేశంలో మామూలుగా జరిగే పాత బంగారం అమ్మకాలతో పోలిస్తే ఈ సారి 25 శాతం ఎక్కువగా ఉన్నాయని కొచ్చికి చెందిన సీజీఆర్ మెటల్లాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బంగారం శుద్ధి సంస్థ ఎండీ జేమ్స్ జోష్ చెప్పారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత పెళ్లి కోసం బంగారం కొనే వారి సంఖ్య పెరగడంతో పాటు.. తమ ఇంటి అవసరాల కోసం బంగారాన్ని అమ్మేందుకు వచ్చే వారూ ఎక్కువయ్యారని వివరించారు.

కరోనా మహమ్మారి ప్రభావం వల్ల రెండేళ్లుగా భారతీయులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం గత ఏడాది అమ్మకాలు రెండు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. అయితే, ఈ ఏడాది అమ్మకాలు 40 శాతం పెరిగే అవకాశం ఉందని చిరాగ్ సేఠ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ధరలు, తగ్గడం, వివాహాల సీజన్ ఉండడంతో 50 టన్నులకు పైగా స్వర్ణ విక్రయాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.

More Telugu News