"అమ్మ బైలెల్లినాది" అంటూ బోనాల శుభాకాంక్షలు తెలిపిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్

11-07-2021 Sun 16:23
  • ప్రారంభమైన ఆషాఢ బోనాలు
  • తెలుగులో ట్వీట్ చేసిన ఆండ్రూ ఫ్లెమింగ్
  • తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఈ బోనాలు అంటూ వ్యాఖ్యలు
  • ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్ష
UK dy high commissioner Dr Andrew Fleming wishes Telangana people on Bonalu

నాలుగు వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న హైదరాబాదు నగరానికి బోనాలు ప్రత్యేక గుర్తింపును అందిస్తాయి. ఆషాఢం రాకతో నగరంలో నేడు బోనాలు షురూ అయ్యాయి. కాగా, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తెలుగు సంప్రదాయాలను విశేషంగా గౌరవిస్తారు. ఈ నేపథ్యంలో, "అమ్మ బైలెల్లినాది" అంటూ స్పందించారు.

బోనాల ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరికీ శుభకాంక్షలు అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బోనాల ఉత్సవాలు అని పేర్కొన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఆండ్రూ ఫ్లెమింగ్ తన ప్రకటనలో వెల్లడించారు. అంతేకాదు, రెండేళ్లకిందట తాను బోనాల వేడుకల్లో పాల్గొన్నప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు.