ఇటీవల భారత్ లో నెలకొన్న పరిస్థితులే ఇప్పుడు ఇండోనేషియాలో!

  • భారత్ పై పంజా విసిరిన కరోనా సెకండ్ వేవ్
  • ఆక్సిజన్ కు తీవ్ర కొరత
  • ప్రాణవాయువు లేక అనేకమంది మృతి
  • ఇండోనేషియాలో ఒక్కసారిగా పెరిగిన కేసులు
  • ఆక్సిజన్ కు విపరీతమైన డిమాండ్
Indonesia suffers with huge oxygen deficit

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ దారుణమైన పరిస్థితులను సృష్టించింది. ఆక్సిజన్ దొరక్క కరోనా రోగులు అల్లాడిపోయారు. ఆక్సిజన్ సకాలంలో అందక చనిపోయిన వాళ్లు ఎందరో! ఈ స్థాయిలో ఆక్సిజన్ కు డిమాండ్ ఏర్పడుతుందని ఊహించని రాష్ట్ర ప్రభుత్వాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్ల ఆవశ్యకత తెలిసివచ్చిన భయానక పరిస్థితులను కొన్నినెలల కిందట భారత్ చవిచూసింది. ఇప్పుడవే పరిస్థితులు ఆగ్నేయాసియా దేశం ఇండోనేషియాకు అనుభవంలోకి వచ్చాయి.

రెండు నెలల కిందట భారత్ ఆక్సిజన్ కొరతతో సతమతం అవుతుంటే వేల ట్యాంకుల కొద్దీ ఆక్సిజన్ అందించిన ఇండోనేషియా ఇప్పుడు తానే ఆక్సిజన్ లభ్యత లేక అలమటిస్తోంది. ఇండోనేషియా జనాభాపరంగా ప్రపంచంలో నాలుగోస్థానంలో ఉంది. దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆసుపత్రులన్నీ రోగులతో క్రిక్కిరిసిపోయాయి. దాంతో మెడికల్ ఆక్సిజన్ కు ఇండోనేషియాలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

నిన్నమొన్నటి వరకు ఇతర దేశాలకు ఆపన్నహస్తం అందించిన ఇండోనేషియా ఇప్పుడు తానే సాయం కోసం చైనా, సింగపూర్ వంటి దేశాల వైపు చూస్తోంది. నిన్న సింగపూర్ నుంచి 1000కి పైగా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు ఇండోనేషియా చేరుకున్నాయి. ఆస్ట్రేలియా కూడా 1000 వరకు వెంటిలేటర్లను పంపింది. ఈ క్రమంలో 36 వేల టన్నుల ఆక్సిజన్ ను, 10 వేల కాన్సంట్రేటర్ పరికరాలను పొరుగునే ఉన్న సింగపూర్ నుంచి కొనుగోలు చేయాలని ఇండోనేషియా ప్రభుత్వం భావిస్తోంది. అటు, అగ్రరాజ్యం అమెరికా, యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా ఈ ఆసియా దేశానికి సాయం చేసేందుకు ముందుకువచ్చాయి.

ఇండోనేషియాలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తమకు అవసరం లేకపోయినా సరే కొందరు ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం పరిశ్రమల నుంచి మెడికల్ ఆక్సిజన్ తయారుచేసి సరఫరా చేస్తున్నప్పటికీ కొరత తీరడంలేదు. ఇండోనేషియాలో ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 40 వేల వరకు ఉండగా, క్రమంగా అది 50 వేలకు చేరే అవకాశం ఉందని, రానున్న రెండు వారాలు ఎంతో కీలకమని అక్కడి నిపుణులు భావిస్తున్నారు.

More Telugu News