చంద్రబాబు బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చి సొంత పార్టీ ఎమ్మెల్యేలనే బలిచ్చాడు: విజయసాయిరెడ్డి

10-07-2021 Sat 20:53
  • విశాఖ మన్యంలో తవ్వకాలపై రాజకీయ రగడ
  • రౌతులపూడి వెళ్లిన టీడీపీ నేతలు
  • లేటరైటు గనుల పరిశీలన
  • బాక్సైటు తవ్వకాలంటూ ఆందోళన
  • బాక్సైట్ బాబు అంటూ విజయసాయి వ్యాఖ్యలు
Vijayasai Reddy take a dig at Chandrababu over Bauxite mining row
విశాఖ మన్యం ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నిన్న టీడీపీ నేతలు రౌతులపూడి వద్ద లేటరైటు తవ్వకాలను పరిశీలించడం ఉద్రిక్తతలకు దారితీసింది. లేటరైటు ముసుగులో బాక్సైటు తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబు నాడు బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చి సొంత పార్టీ ఎమ్మెల్యేలనే బలిచ్చాడని ఆరోపించారు.

చంద్రబాబును విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ బాబు అంటారని పేర్కొన్నారు. కనీసం ఒక్క ఎస్టీ సీటు కూడా గెలవలేకపోయాడని విమర్శించారు. బాక్సైట్ తవ్వకాలను నిషేధించింది జగన్ ప్రభుత్వమేనని విజయసాయి స్పష్టం చేశారు. టీడీపీ మైనింగ్ మాఫియా కోసమే చంద్రం-అయ్యన్న డ్రామాలు మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు.

అటు, కృష్ణా జలాల అంశంపైనా విజయసాయి... టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు కృష్ణా జలాలపై హక్కులను పణంగా పెట్టిన రాష్ట్ర ద్రోహి చంద్రబాబు అని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రం ఆయన హయాంలోనే శ్రీశైలంపై 179 టీఎంసీల ప్రాజెక్టులు మొదలుపెట్టినా చంద్రబాబు కిక్కురుమనలేదని, ప్రజల కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని భావించారని ఆరోపించారు.