Out Sourcing: హైదరాబాదులో ఉద్రిక్తతకు దారి తీసిన నర్సుల ఆందోళన

  • ఆందోళన చేపట్టిన అవుట్ సోర్సింగ్ నర్సులు
  • రేవంత్ ను కలిసి ర్యాలీగా వెళ్లేందుకు యత్నం
  • అడ్డుకున్న పోలీసులు, తోపులాట
Out sourcing nurses in Hyderabad holds protest

తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని అవుట్ సోర్సింగ్ నర్సులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద నర్సులు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడానికి గాంధీ భవన్ వద్దకు నర్సులు వచ్చారు.

ఆ తర్వాత అక్కడి నుంచి కోఠిలోని డీఎంఈ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు యత్నించారు. అయితే, వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, నర్సులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో 20 మంది నర్సులను అరెస్ట్ చేసి నారాయణగూడ పీఎస్ కు తరలించారు. తోపులాటలో మమత అనే నర్సుకు గాయాలైనట్టు సమాచారం.

మరోవైపు, నర్సుల ఆందోళనకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సంఘీభావం ప్రకటించింది. విధుల నుంచి తొలగించిన కాంట్రాక్టు నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకుని, జీతాలను చెల్లించాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేసిన నర్సుల పట్ల ఇలా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు.

More Telugu News