Chandrababu: రౌతులపూడి ఘటనపై అయ్యన్నపాత్రుడు, చినరాజప్పలతో మాట్లాడిన చంద్రబాబు

  • విశాఖ మన్యంలో లేటరైట్ తవ్వకాలు
  • పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతలు
  • మీడియా సమావేశం ఏర్పాటుచేసిన వైనం
  • అడ్డుకున్న పోలీసులు..టీడీపీ నేతల నిరసన
Chandrababu talks to party leaders about Rowthulapudi incident

విశాఖ మన్యంలో లేటరైట్ తవ్వకాలను పరిశీలించేందుకు ఇవాళ టీడీపీ బృందం వెళ్లింది. స్థానిక గిరిజనులను అడిగి టీడీపీ నేతలు వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో, రౌతులపూడి మండలం జల్దాం నుంచి విశాఖ జిల్లా సిరిపురం వరకు రోడ్డు విస్తరణ చేయడాన్ని టీడీపీ నేతలు గమనించారు. రోడ్డు విస్తరణలో భాగంగా తమ పొలాలు, చెట్లు పోయాయని గిరిజనులు టీడీపీ నేతల ముందు ఆవేదన వెలిబుచ్చారు. కేవలం లేటరైట్ ను తరలించేందుకే రోడ్డు వేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు జగన్ ప్రభుత్వం తెరలేపిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేయడం ఏంటని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా టీడీపీ నేతలు రౌతులపూడి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. టీడీపీ బృందంలోని అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప వంటి సీనియర్ నాయకులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గిరిజన, అటవీ భూముల్లో రోడ్డు వేయడం వంటి పరిణామాలపై ఆరా తీశారు.

More Telugu News