ఇంటి నుంచి బయటకు రావొద్దు.. సిడ్నీలో లాక్ డౌన్ కఠినతరం

09-07-2021 Fri 14:48
  • గత 24 గంటల్లో 44 డెల్టా వేరియంట్ కేసులు
  • జూన్ మధ్య నుంచి 439 కేసులు
  • సిడ్నీలో మూడో వారానికి చేరుకున్న లాక్ డౌన్
Lockdown in Sydney tightened
కరోనా డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో ఆస్ట్రేలియాలోనే అతి పెద్ద నగరమైన సిడ్నీలో లాక్ డౌన్ ను కఠినతరం చేశారు. గత 24 గంటల్లో 44 డెల్టా వేరియంట్ కేసులు నమోదు కావడంతో సిడ్నీ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని పేర్కొన్నారు.

సిడ్నీలో లాక్ డౌన్ మూడో వారానికి చేరుకుంది. వ్యాక్సిన్ వేయించుకోని వారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఇప్పుడే నెలకొందని అధికారులు చెప్పారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తుండటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. జూన్ మధ్య నుంచి సిడ్నీలో 439 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా జనాభాలో ఇప్పటి వరకు కేవలం 9 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారు.