జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. బాపట్ల జవాను జశ్వంత్‌రెడ్డి వీరమరణం

09-07-2021 Fri 09:12
  • రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్
  • నేటి రాత్రికి బాపట్లకు జశ్వంత్‌రెడ్డి మృతదేహం
  • కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
Bapatla Army Jawan Killed in an encounter held in jammu and kashmir
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ జవాను మనుప్రోలు జశ్వంత్‌రెడ్డి (23) వీరమరణం పొందాడు. రాజౌరీ జిల్లాలోని సుందర్‌బాని సెక్టారులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే, ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందినట్టు ఆర్మీ అధికారులు ఈ ఉదయం ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలిసి తల్లిదండ్రులు వెంకటేశ్వరమ్మ, శ్రీనివాసరెడ్డి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

నేటి రాత్రికి జశ్వంత్ మృతదేహం బాపట్లకు చేరుకునే అవకాశం ఉంది. కాగా, జశ్వంత్‌రెడ్డి 2016లో మద్రాసు రెజిమెంట్‌లో సైన్యంలో చేరాడు.  తొలుత నీలగిరిలో పనిచేసిన జశ్వంత్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం సెలవులపై ఇంటికి వచ్చాడు. మరో నెల రోజుల్లో కుమారుడికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలోనే అతడు అమరుడైన విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.