Brahmam Gari Matam: బ్రహ్మంగారి మఠానికి ప్రత్యేక అధికారిని ఏ ప్రాతిపదికన నియమించారు?: ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

High Court questions AP govt in the case of Braham Gari Matam
  • మళ్లీ తెరపైకి బ్రహ్మంగారి మఠం వివాదం
  • హైకోర్టును ఆశ్రయించిన మారుతి మహాలక్ష్మమ్మ
  • దేవాదాయశాఖ జోక్యం చేసుకుందని ఆరోపణ
  • ఈ నెల 12కి విచారణ వాయిదా వేసిన హైకోర్టు
బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతి విషయంలో వివాదం సమసిపోయిందనుకున్నంతలో, హైకోర్టులో ఈ అంశం విచారణకు వచ్చింది. దివంగత పీఠాధిపతి వెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ  కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మఠాధిపతి ఎంపికలో ఏపీ దేవాదాయశాఖ జోక్యం చేసుకుందని ఆరోపించారు. మఠానికి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమనే గుర్తించేలా దేవాదాయ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఆమె న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

నేటి విచారణ సందర్భంగా కోర్టు స్పందిస్తూ, గతంలో బ్రహ్మంగారి మఠానికి  ఏ ప్రాతిపదికన  ప్రత్యేక అధికారిని నియమించారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.

ఇటీవల మధ్యవర్తుల సమక్షంలో బ్రహ్మంగారి మఠం నూతన పీఠాధిపతి అంశంపై నిర్ణయం తీసుకున్నారు. వెంకటేశ్వరస్వామి పెద్ద భార్య మొదటి కుమారుడు వెంకటాద్రిస్వామి బ్రహ్మంగారి మఠాధిపతిగా, రెండో కుమారుడు వీరభద్రయ్య ఉత్తరాధికారిగా వ్యవహరించేందుకు ఒప్పందం కుదిరింది. రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ కుమారుడు గోవిందస్వామి (ప్రస్తుతం మైనర్) తదుపరి మఠాధిపతి అవుతాడని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ, మారుతి మహాలక్ష్మమ్మ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది.
Brahmam Gari Matam
Andhra Pradesh
AP High Court
Maruti Mahalakshmamma

More Telugu News