Wimbledon: 'ఇదే చివరి వింబుల్డనా?' అన్న ప్రశ్నకు ఫెదరర్​ సమాధానం ఇదీ!

  • క్వార్టర్స్ లో హుబర్ట్ హర్కాజ్ చేతిలో పరాజయం
  • తనకింకా చాన్స్ ఉందన్న 20 సార్లు చాంపియన్
  • ప్రస్తుతానికైతే రిటైర్మెంట్ ఆలోచనల్లేవని వెల్లడి
Federer Answer On His Wimbledon Future Career

బుధవారం జరిగిన వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ లో 20 సార్లు గ్రాండ్ స్లామ్ విజేత రోజర్ ఫెదరర్ ఓడిపోయాడు. తన ప్రత్యర్థి హుబర్ట్ హర్కాజ్ చేతిలో 3–6, 6–7 (4/7), 0–6 తేడాతో ఓటమి పాలయ్యాడు. మూడు వరుస సెట్లలోనూ అతడు వెనుకబడిపోయాడు. మరికొన్ని రోజుల్లో 40 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టబోతున్న ఈ స్విస్ దిగ్గజం.. తన కెరీర్ పై మ్యాచ్ అనంతర కార్యక్రమంలో స్పందించాడు.

‘‘ఏమో.. ఈ విషయం నాకింకా తెలియదు. ఇదే నా చివరి వింబుల్డన్ అవుతుందా? అన్నది స్పష్టంగా చెప్పలేను. గత 18 నెలలుగా చాలా కష్టంగా ఉంది. ఓడిపోయినప్పుడల్లా చాలా బాధగా, దిగులుగా అనిపిస్తోంది. అలసిపోయానన్న భావన వెంటాడుతోంది. ఇప్పుడే వెళ్లి నిద్రపోతే బాగుండుననిపించేది. మానసికంగా మరింత బలంగా తయారయ్యేందుకు కనీసం నిద్రయినా ఉంటే మంచిది కదా’’ అన్నాడు నవ్వుతూ.

ప్రస్తుతానికైతే రిటైర్మెంట్ ఆలోచనలేవీ లేవన్నాడు. ఒకేసారి కొండపైకి చేరుకోవాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందన్నాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ కొండంచును అందుకోవాలని స్పష్టం చేశాడు. తన విషయంలో వింబుల్డన్ ఒక సూపర్ స్టెప్ అని చెప్పాడు. తన టీమ్ తో మాట్లాడి సరైన నిర్ణయమే తీసుకున్నానని అన్నాడు. క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.

పది, ఇరవై ఏళ్ల క్రితం తన ఆట చాలా సహజంగా ఉండేదని, అన్నీ సహజసిద్ధంగా జరిగిపోయేవని ఫెదరర్ అన్నాడు. ప్రస్తుతం మాత్రం మానసికంగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పాడు. ఎన్నో ఆలోచనలతో కోర్టులోకి దిగుతానని, కానీ, కొన్నింటిని అమలు చేయలేకపోతున్నానని చెప్పాడు. తాను ఇప్పుడు మ్యాచ్ లో ఓడిపోయినా ఇంకా అవకాశం మాత్రం మిగిలే ఉందని అనుకుంటున్నట్టు చెప్పాడు.

More Telugu News