India: రూ.15 వేల కోట్ల బకాయిల కోసం.. విదేశాల్లోని రూ.6 లక్షల కోట్ల భారత ఆస్తులపై కెయిర్న్​ కన్ను!

  • ప్యారిస్ లో భారత ఆస్తులను సీజ్ చేయించిన సంస్థ
  • రూ.176 కోట్ల ఆస్తుల స్వాధీనం
  • ఆదేశాలిచ్చిన ప్యారిస్ కోర్టు
  • 20 ఆస్తులున్నాయంటున్న అక్కడి వర్గాలు
  • వివిధ ఆఫీసులను నడుపుతున్న భారత్
  • మరిన్ని దేశాల్లోని ఆస్తులపైనా సంస్థ కన్ను
France Court Freezes Indian Assets In Paris In Favour of Cairn Energy

తనకు రావాల్సిన 172 కోట్ల డాలర్ల (సుమారు రూ.15,173 కోట్లు)  బకాయిల కోసం.. వివిధ దేశాల్లోని 7,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.17 లక్షల కోట్లు) విలువైన భారత ఆస్తులను ఫ్రీజ్ చేయించేందుకు బ్రిటన్ కు చెందిన కెయిర్న్ ఎనర్జీ కపట పన్నాగాలు పన్నుతోంది. ఇప్పటికే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నడిబొడ్డులో ఉన్న ఆస్తులను ఫ్రీజ్ చేయించింది. తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. వాటి విలువ 2 కోట్ల యూరోలు (సుమారు రూ.176.44 కోట్లు).

అక్కడి భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఫ్రాన్స్ కోర్టు ఆమోదం తెలిపింది. పారిస్ లోని 20 భారత ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చింది. సంస్థపై విధించిన పన్నును ఆర్బిట్రేషన్ ప్యానెల్ రద్దు చేయడంతో.. బకాయిలను రాబట్టుకోవడం కోసం ట్రైబ్యునల్ జ్యుడీషియరీ డి ప్యారిస్ కోర్టుకు కెయిర్న్ ఎనర్జీ వెళ్లింది.

ఈ నేపథ్యంలోనే బకాయిలకుగానూ పారిస్ లో ఉన్న 20 భారత ఆస్తులను స్వాధీనం చేసుకునేలా కెయిర్న్ ఎనర్జీకి కోర్టు అధికారాలిచ్చిందని అక్కడి ప్రతినిధులు చెబుతున్నారు. సెంట్రల్ ప్యారిస్ లోని భారత్ కు చెందిన ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, రియల్ ఎస్టేట్ ఆస్తులను జ్యుడీషియల్ మార్టిగేజ్ ద్వారా ఫ్రీజ్ చేయాల్సిందిగా జూన్ 11న కోర్టును కెయిర్న్ కోరిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ బుధవారం సాయంత్రం పూర్తయ్యాయని అన్నారు. అయితే, దీనిపై ఫ్రాన్స్ కోర్టు నుంచి ఇంకా ఎలాంటి నోటీసులూ రాలేదని భారత ప్రభుత్వ వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్యారిస్ లోని భారత ఫ్లాట్లలో మన కార్యాలయాలున్నాయి. ఇప్పుడు కోర్టు తీర్పు నేపథ్యంలో ఆ కార్యాలయాలను ఖాళీ చేయిస్తారా? లేదా అందులోనే కొనసాగించేందుకు కెయిర్న్ అంగీకరిస్తుందా? అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. అయితే, అధికారులను కెయిర్న్ ఖాళీ చేయించే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు.

ఇదీ అసలు విషయం...

భారత ప్రభుత్వం విధించిన పన్నులను సవాల్ చేస్తూ కెయిర్న్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనంలో భారత న్యాయమూర్తి కూడా ఉన్నారు. భారత ప్రభుత్వం విధించిన పన్నులను గత ఏడాది డిసెంబర్ లో బెంచ్ ఏకగ్రీవంగా రద్దు చేసింది. విక్రయించిన షేర్లు, పంచుకున్న లాభాలు, పన్ను రీఫండ్ల వంటి వాటిని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అయితే, భారత్ అందుకు నిరాకరించింది.

దీంతో ఆ బకాయిలను రాబట్టుకునేందుకు కెయిర్న్.. వివిధ దేశాల్లోని భారత ఆస్తులను ఫ్రీజ్ చేయాలని కోరుతూ ఆయా దేశాల కోర్టులకు వెళ్లింది. ఈ క్రమంలోనే అమెరికాలో కెయిర్న్ వ్యాజ్యం దాఖలు చేసింది. భారత ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎయిరిండియాను బకాయిల చెల్లింపులకు బాధ్యులుగా న్యూయార్క్ లోని సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పునిచ్చింది. దాంతో పాటు ఆస్తుల విలువ ఎక్కువగా ఉన్న దేశాల్లోనూ మరిన్ని వ్యాజ్యాలను వేసేందుకు కెయిర్న్ ఎత్తుగడలు వేస్తోంది. అమెరికా, బ్రిటన్, కెనడా, సింగపూర్, మారిషస్, నెదర్లాండ్స్ లోనూ పిటిషన్లు వేయనుంది.

కాగా, ఈ వ్యవహారంపై ఫ్రాన్స్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. అయితే, కెయిర్న్ ప్రతినిధి దీనిపై స్పందించారు. భారత ప్రభుత్వంతో చర్చల ద్వారా విషయాన్ని సెటిల్ చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అందుకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి భారత్ కు ప్రతిపాదనలను పంపుతూనే ఉన్నామని అన్నారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ప్రస్తుతం కోర్టు ఆర్డర్ తో ప్యారిస్ లోని ఆస్తులను భారత ప్రభుత్వం అమ్మడానికి లేదు. అవన్నీ ఇప్పుడు కెయిర్న్ చేతిలోనే ఉంటాయి కాబట్టి.. లావాదేవీలన్నీ ఆ సంస్థ తరఫునే జరగాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

తాము సెటిల్మెంట్ కు వచ్చే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం ఈ ఏడాది మేలో తేల్చి చెప్పింది. బకాయిలను చెల్లించాలంటూ ఆర్బ్రిట్రేషన్ ట్రైబ్యునల్ ఏకపక్ష తీర్పును ఇచ్చిందని ఆర్థిక శాఖ అసహనం వ్యక్తం చేసింది. తమ దేశానికి సంబంధించిన జాతీయ పన్నుల వివాదాలపై తప్పుగా అవగతం చేసుకుందని వ్యాఖ్యానించింది.

స్థానిక షేర్ మార్కెట్లలో లిస్టింగ్ చేసుకోవడం కోసం 2006లో కెయిర్న్ ఇండియా సంస్థను పునర్వ్యవస్థీకరించిందని, భారత పన్ను చట్టాలకు అది వ్యతిరేకమని పేర్కొంది. కాబట్టి భారత్–బ్రిటన్ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ప్రకారం.. ఆ పెట్టుబడులకు కల్పించే రక్షణ ఇప్పుడు కెయిర్న్ విషయంలో వర్తించదని స్పష్టం చేసింది. 1994లో రాజస్థాన్ లో భారీ చమురు నిల్వలను సంస్థ గుర్తించింది. 2006లో బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ (బీఎస్ఈ)లో తన భారత ఆస్తులను లిస్ట్ చేసింది. ఆ తర్వాత ఐదేండ్లకు దీనిపై నాటి కేంద్ర ప్రభుత్వం పన్ను చట్టాల ప్రకారం.. కెయిర్న్ కు రూ.10,247 కోట్ల పన్ను, జరిమానాను విధించింది. దీనిపైనే కెయిర్న్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది.

More Telugu News