rain: తెలంగాణ‌లో నేడు, రేపు కూడా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

  •  నిన్న తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు  
  •  హైదరాబాద్‌లో  4 రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం
  •  ఆదిలాబాద్‌లో తెల్లవారు జాము నుంచి ఎడ‌తెరిపి లేకుండా వాన‌
rains in ts

తెలంగాణ‌లోని జోగులాంబ గద్వాల జిల్లా మినహాలో  దాదాపు అన్ని జిల్లాల్లో  నిన్న భారీ వ‌ర్షాలు కురిశాయి. నేడు, రేపు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేగాక‌, హైదరాబాద్‌లో నాలుగు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని చెప్పింది. తెలంగాణ‌లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండ‌డంతో వ‌ర్షాలు కురుస్తున్నాయ‌ని వివ‌రించింది.

కాగా, ఆదిలాబాద్‌లో ఈ రోజు తెల్లవారు జాము నుంచి ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. సంజ‌య్ న‌గ‌ర్, విక‌లాంగుల కాల‌నీలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఆదిలాబాద్‌లోని పొచ్చెర జలపాతం పొంగిపొర్లుతోంది. ప‌లు ప్రాంతాల్లో రోడ్లు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.

ఈ రోజు ఉదయం 6 గంటల వరకు తెలంగాణ‌లో అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్‌లో 13 సెంటీమీటర్ల వ‌ర్ష‌పాతం నమోదైంది. ఆ త‌ర్వాత‌ నిజామాబాద్‌ జిల్లా మెండోరాలో 12.4 సెంటీమీటర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. అలాగే, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కాప్రాలో 11.8, నిజామాబాద్‌ జిల్లాలోని వాయిల్‌పూర్‌లో 11.5 సెంటీమీట‌ర్ల వ‌ర్షపాతం న‌మోదైంది.

More Telugu News