G. Kishan Reddy: కేంద్ర కేబినెట్‌లో చోటుతో రికార్డుల్లోకి కిషన్‌రెడ్డి

Kishan Reddy is the first Central minister for telangana after state division
  • వెంకయ్యనాయుడు తర్వాత కేబినెట్‌లో చోటు దక్కించుకున్న తెలుగు రాష్ట్రాల నేత
  • పనితీరుతో మోదీ, అమిత్‌షాను ఆకట్టుకున్న కిషన్ రెడ్డి
  • 2019లో ఎంపీగా ఎన్నికైన తొలిసారే మంత్రి పదవి
నిన్న జరిగిన కేంద్ర కేబినెట్‌ విస్తరణలో ప్రమోషన్ దక్కించుకున్న తెలంగాణ బీజేపీ నేత కిషన్‌రెడ్డి రికార్డుల్లోకి ఎక్కారు. సాంస్కృతిక, పర్యాటకం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను ఆయనకు కేటాయించారు. ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి కేబినెట్ హోదా దక్కించుకున్న తొలి నేతగా గుర్తింపు పొందారు.

హోంశాఖ సహాయమంత్రిగా 25 నెలల ఏడు రోజులు పనిచేసిన కిషన్‌రెడ్డి నిన్న కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నరేంద్రమోదీ తొలి విడత ప్రభుత్వంలో బండారు దత్తాత్రేయ స్వతంత్ర హోదాలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన కిషన్‌రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవి దక్కింది.

అదే ఏడాది మే 30 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అవిభాజ్య ఏపీలో తెలంగాణ ప్రాంతం నుంచి సీహెచ్ విద్యాసాగర్‌రావు, బంగారు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ కేంద్రంలో సహాయమంత్రులుగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ నుంచి చూస్తే మాత్రం వెంకయ్యనాయుడు తర్వాత కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్నది కిషన్ రెడ్డి మాత్రమే. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్‌రెడ్డి 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించారు.

విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్న కిషన్ రెడ్డి 1960లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మపురంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఎంపీగా గెలిచిన తొలిసారే కేంద్ర మంత్రి పదవి పొందిన కిషన్‌రెడ్డి తన పనితీరుతో మోదీని ఆకట్టుకున్నట్టు తెలుస్తోంది. తన శాఖపై పట్టు సాధిస్తూ మోదీ, అమిత్ షా వద్ద మెప్పు పొందారు.
G. Kishan Reddy
Cental Cabinet
Minister
Telangana

More Telugu News